మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రం టీజర్ ఈ మధ్యనే విడుదలయ్యి యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అంతేకాకుండా దర్శకనిర్మాతలు.. రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించడంతో.. బిజినెస్ కూడా సైలెంట్ గా మొదలైపోయింది. ఒక్క నైజాంలోనే ఈ చిత్రం రూ.42కోట్లకు అమ్ముడవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. మే 13న విడుదల కాబోతున్న ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.45 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాలన్న మాట.
అయితే ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుని పరిస్థితి నార్మల్ అవుతున్న తరుణంలో.. మెగాస్టార్ ‘ఆచార్య’ ఒక్క నైజాంలోనే అంత పెద్ద మొత్తం రాబట్టగలదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. నిజానికి నాన్- బాహుబలి ఇండస్ట్రీ హిట్లలో ఒక్క ‘అల వైకుంఠపురములో’ చిత్రం మాత్రమే రూ.40కోట్ల పైగా షేర్ ను రాబట్టింది. ఆ చిత్రం ఫుల్ రన్లో భారీగా రూ.44కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. ఆ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలవ్వడం… పైగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో లాంగ్ రన్లో ఆ ఫీట్ ను సాధించింది.
అయితే ‘ఆచార్య’ సమ్మర్ లో విడుదల కాబోతుంది. పైగా ఆ చిత్రానికి ముందు వారం అలాగే వెనుక వారం కూడా సినిమాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఎంత మెగాస్టార్ సినిమా అయినా.. ‘ఆచార్య’ అంత కలెక్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ‘సైరా’ సినిమాకి పోటీగా మరో సినిమా లేకపోయినా 33కోట్ల షేర్ ను మించలేకపోయిన విషయం కూడా దీనికి సంకేతాలు ఇస్తుంది.