జగదేక వీరుడు అతిలోకసుందరి మూవీ 30ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు చిత్ర యూనిట్ పంచుకున్నారు. హీరో నాని వాయిస్ ఓవర్ తో కొన్ని ప్రత్యేక వీడియోలు విడుదల చేయడం జరిగింది. చిరంజీవి, శ్రీదేవి జంటగా దర్శకుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ ఆల్ టైం బ్లాక్ బస్టర్ వసూళ్ల వివరాలతో పాటు, రెమ్యూనరేషన్స్ గురించి కూడా నిర్మాత అశ్వినీ దత్ ఓ కార్యక్రమంలో తెలియజేశారు. జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ మొత్తంగా 7 కోట్ల రూపాయల షేర్ రాబట్టిందట. 1990లో అంటే ఇది చాలా మొత్తం అని అర్థం.
అందులోను అప్పటి టికెట్ ధర కేవలం 6 రూపాయలు, అది కూడా బాల్కనీ మాత్రమే. ఇక ఈ సినిమాకు చిరంజీవికి రెమ్యూనరేషన్ గా 35లక్షలు ఇచ్చారట. హీరోయిన్ శ్రీదేవికి 25లక్షలు ఇవ్వడం విశేషం. అప్పటికే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిన శ్రీదేవికి అది భారీ పారితోషికం అనాలి. ఇక ఈ మూవీ ద్వారా అశ్వినీ దత్ కి బాగానే లాభాలు దక్కాయట. ఐతే ఈ సినిమా తరువాత చిరంజీవి పారితోషికం మూడు రెట్లు పెంచేశాడట. చిరంజీవి క్రేజ్ పీక్స్ కి చేరడంతో ఆయన రెమ్యూనరేషన్ ఒక కోటి దాటివేసిందని సమాచారం.
కొదమ సింహం, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో చిరు కెరీర్ పీక్స్ కి చేరింది. అదే సమయంలో చిరంజీవి ఆజ్ కా గూండా, ప్రతి బంద్ వంటి హిందీ చిత్రాలు కూడా చేయడం జరిగింది. చిరంజీవి సినిమా అంటే కాసుల వర్షమే అన్నట్లుగా ఆయన పాపులారిటీ ఉండేది. ఇక 1992లో వచ్చిన ఘనరా మొగుడు 10 కోట్ల వసూళ్లు సాధించడంతో అదే ఏడాది వచ్చిన ఆపద్భాంధవుడు మూవీ కోసం చిరు 1.2 కోట్లు తీసుకున్నారట. అది అమితాబ్ రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ కావడం గమనార్హం. అమితాబ్ సినిమాకు కోటి తీసుకునేవారు.