“ప్రేమ కావాలి” అనే క్లీన్ లవ్ స్టోరీతో హీరోగా కెరీర్ ను మొదలెట్టిన ఆది ఆ తర్వాత మాస్ ఇమేజ్ కోసం ఆరాటపడి “రఫ్, గరం” లాంటి సినిమాలతో ఘోరమైన పరాజయాలు అందుకొన్నాడు. దాంతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఫిక్సయిన ఆది అప్పటికి “భాయ్”తో డిజాస్టర్ అందుకొని దర్శకుడిగా డీలా పడ్డ వీరభద్రమ్ తో దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం “చుట్టాలబ్బాయి”. మలయాళ నటి నమిత ప్రమోద్ కథానాయికగా పరిచయమైన ఈ చిత్రం పలుమార్లు వాయిదాపడిన అనంతరం నేడు (ఆగస్ట్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి “చుట్టాలబ్బాయి”గా ప్రేక్షకులను ఏమేరకు అలరించాడో చూద్దాం..!!
కథ : బాబ్జీ (ఆది) అమెరికా వెళ్ళి జాబ్ సంపాదించుకోవడం కోసం కావాల్సిన కోర్సులు చేసుకుంటూ.. హెచ్.డి.ఎఫ్.సీ బ్యాంక్ లో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. తన స్నేహితుడి పెళ్ళిలో కావ్య (నమిత ప్రమోద్)తో పరిచయం ఏర్పడుతుంది. వారిద్దరి స్నేహాన్ని తప్పుగా అర్ధం చేసుకొన్న ఏసీపీ గౌతమ్ కృష్ణ (అభిమన్యు సింగ్) బాబ్జీని పోలీస్ టార్చర్ కి గురి చేస్తుంటాడు. ఏసీపీ చెల్లెలికి తనతో ఎటువంటి సంబంధం లేదని తెలియజెప్పడం కోసం అతడి ఇంటికి వెళ్ళగా.. అప్పూడే ఇంటి నుంచి పారిపోతున్న కావ్య కనిపిస్తుంది. తనను సేఫ్ గా ఊరు దాటిస్తే తనకు బాబ్జీతో ఎటువంటి సంబంధం లేదని తన అన్నకి ఫోన్ చేసి చెప్తానని ప్రామిస్ చేస్తుంది. దాంతో ఆమెను హైద్రాబాద్ దాటించేందుకు పూనుకొంటాడు బాబ్జీ. ఈ ప్రయాణ సమయంలో వీరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది.
అయితే.. ఏసీపీ మాత్రమే కాకుండా ఇంకో గ్యాంగ్ కూడా కావ్య ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ గ్యాంగ్ ఎవరు? కావ్యను ఎందుకు కిడ్నాప్ చేయాలనుకొంటారు? చివరికి బాబ్జీ-కావ్యల ప్రేమ ఫలించిందా? లేదా? అనేది “చుట్టాలబ్బాయి” చిత్ర కథాంశం.
నటీనటుల పనితీరు : బాబ్జీ పాత్రలో ఆది ఎనర్జీటిక్ గానే నటించాడు. అయితే.. కథ-కథనాల్లో ఏమాత్రం కొత్తదనం మాత్రమే కాక కనీస స్థాయి కంటెంట్ కూడా లేకపోవడంతో అతడి శ్రమ బూడిదలో పోసిన పన్నీరులా మారింది.
మలయాళ నటి నమిత ప్రమోద్ హావభావాల విషయంలో ఆకట్టుకొంది. ఆది తర్వాత సినిమాలో కాస్త బెటర్ అనిపించేది హీరోయిన్ నమిత మాత్రమే.
హీరో తండ్రిగా ఆది రియల్ లైఫ్ ఫాదర్ అయిన సాయికుమార్ నటించడం ఫ్రేమింగ్ కి అందంగానే కనిపించినప్పటికీ.. అసలు సినిమాలో సాయికుమార్ క్యారెక్టర్ ఏంటనేది అర్ధం కాక ఆడియన్స్ మాత్రం చాలా అయోమయపడుతుంటారు. ఈగో రెడ్డిగా పృధ్వీ పాత్ర సినిమాలో కాస్తో కూస్తో నవ్వించిన ఏకైక క్యారెక్టర్. కాకపోతే.. ఎప్పట్లానే ఈ సినిమాలోనూ బాలయ్య డైలాగుల్నీ బట్టీకొట్టి చెప్పడంతో ప్రేక్షకులు కూడా బోర్ కొట్టిస్తుంది. అలీ, శకలక శంకర్ లు నవ్వించడానికి విఫల యత్నాలు ఎన్ని చేసినా.. చివరికి ప్రేక్షకుడికి మాత్రం చిరాకే మిగిలింది.
పోసాని కూతురుగా నటించిన అనితానాధ్ అందాలను అత్యంత ఉదారంగా ఆరబోసి మాస్ ఆడియన్స్ ను ఓ మేరకు ఆకట్టుకొన్నా.. మిగతా సెక్షన్ ఆడియన్స్ ను మాత్రం బాగా ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా నదిలో ఈతకొట్టే సీన్ లో అమ్మడి యద అందాలు ముప్పాతిక శాతం బహిర్గతమవ్వడం గమనార్హం.
పోసాని, రఘుబాబు మరియు ఇతర క్యాస్టింగ్ తమ తమ పాత్రలకు న్యాయం చేయడానికి ప్రయత్నించారు.
సాంకేతికవర్గం పనితీరు : ఎస్.ఎస్.తమన్ మరోమారు తన డప్పులకు పూర్తి స్థాయిలో పనిచెప్పాడు. ఒక్క సీన్ కూడా వదలకుండా అన్నీ సన్నివేశాల్లోనూ బ్యాండ్ మోతతో దాదాపుగా ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాడు.
“జక్కన్న” తర్వాత రచయిత భవానీ ప్రసాద్ మరోమారు తన కలాన్ని ప్రాసల కోసం పరుగులు పెట్టించాడు. ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా కొత్తగా అనిపించకపోవడం అటుంచి.. నెక్స్ట్ డైలాగ్ ఏంటనేది ఆడియన్స్ థియేటర్ లో అరవడం అనేది అతడిలోని భావ దారిద్ర్యానికి నిదర్శనం. అరుణ్ కుమార్ కెమెరా పనితనం ఒకే. ఫైట్ సీక్వెన్స్ ను బాగా హ్యాండిల్ చేశాడు. లైటింగ్ విషయంలో కాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.
ఫైట్స్ మాత్రం “అతి” కూడా బాబోయ్ అనే రేంజ్ లో ఉన్నాయి. అసలా జనాలు గాల్లో ఎగరడం ఏంటో? హీరోగారు గాల్లో గింగిరాలు తిరిగి మరీ ఫైట్ చేసేయడం ఏంటో? ఎంత ఆలోచించినా అర్ధమే కాదు.
“వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి” ఈ నిర్మాతలను చూసి జాలి పడాలో లేక వారి అమాయకత్వానికి బాధపడాలో అర్ధం కాదు. ఒక ఫ్లాప్ డైరెక్టర్ ను అంత గుడ్డిగా నమ్మి భారీ స్థాయిలో ఖర్చు చేశారు. కానీ.. వీరభద్రమ్ వారి నమ్మకాన్ని 10% కూడా నిలబెట్టుకోలేకపోయాడు.
దర్శకుడిగా, కథకుడిగా వీరభద్రమ్ దారుణంగా విఫలమయ్యాడు. అసలు ఆ టైటిల్ జస్టీఫికేషన్ చేసిన విధానమే దర్శకుడిగా అతడి ప్రతిభకు నిదర్శనం. “భాయ్” అనుకొంటే.. దానికి బాబులాంటి డిజాస్టర్ గా “చుట్టాలబ్బాయి”ని చిత్రీకరించాడు వీరభద్రమ్. ఈ సినిమా తర్వాత కూడా వీరభధ్రమ్ కి దర్శకుడిగా ఇంకో అవకాశం వస్తే.. దాన్ని ప్రపంచ వింతల్లో ఒకటిగా గుర్తుంచుకోవచ్చు!