“సినిమా” అనేది ఒక ప్రపంచమైతే, ఆ ప్రపంచంలో వీరవిహారం చేయాలనేది ప్రతి సినిమా పిచ్చోడి కల. కల అందరూ కంటారు, కానీ ఆ కలను, కళతో సాకారం చేసుకొనే అదృష్టం మాత్రం కొందరికే ఉంటుంది. ఆ సినిమా ప్రపంచంలోని చీకటి కోణాన్ని “నేనింతే” సినిమాలో చూపించారు పూరీ జగన్నాధ్. అదే ప్రపంచంలోకి వెళ్లాలనుకొనే కొందరు ఆశాపరుల ప్రయాసను, ప్రయాణాన్ని తెరపై చిత్రించారు ప్రవీణ్ కండ్రేగుల, అదే “సినిమా బండి”. ఎందుకని “సినిమా బండి” తప్పకుండా చూడాల్సిన చిత్రమో సమీక్ష చదివి తెలుసుకోండి..!!
కథ: వీరబాబు (వికాస్ వశిష్ట)కి ఆటోలో ఒక మంచి కెమెరా దొరుకుతుంది. మొదట ఆ కెమెరాను అమ్మేసి ఆటో సొంతంగా కొనుక్కోవాలనుకుంటాడు. కానీ.. ఆ కెమెరాతో సినిమా తీస్తే బోలెడంత డబ్బు సంపాదించి, తన కుటుంబ కష్టాలతోపాటు, ఊరి కష్టాలు కూడా తీరుద్దామని నిర్ణయించుకుంటాడు. ఊర్లో పెళ్లి ఫోటోలు, వీడియోలు తీసుకొనే గణపతి (సందీప్ వారణాసి)ని కెమెరామెన్ గా, కటింగ్ షాప్ కుర్రాడు మరిడేష్ (రాగ్ మయూర్), కూరగాయలు అమ్ముకునే మంగ (ఉమ)లను హీరోహీరోయిన్లుగా పెట్టి, స్వాతి పుస్తకంలోని ఒక కథ ఆధారంగా సినిమా మొదలెడతాడు. ఆ క్రమంలో వీరబాబు & గ్యాంగ్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? చివరికి విజయవంతంగా సినిమాను తీయగలిగారా లేదా? అనేది “సినిమా బండి” కథాంశం.
నటీనటుల పనితీరు: “కేరాఫ్ కంచరపాలెం” తర్వాత అందరూ కొత్తవారితో తెరకెక్కిన చిత్రమిది. కొందరు థియేటర్ ఆర్టిస్టులున్నారు, కొందరు కొత్తవాళ్ళూ ఉన్నారు. అందరూ అద్భుతంగా జీవించారు. వికాస్ వశిష్ట, సందీప్ వారణాసి, రాగ్ మయూర్, త్రిషారా, సిరివెన్నెల యానమండల ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆటోడ్రైవర్ క్యారెక్టర్ నుంచి బాషా వరకూ అందరి నుంచి సన్నివేశానికి తగ్గ నటన రాబట్టుకున్నాడు దర్శకుడు ప్రవీణ్.
సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్స్ అపూర్వ శాలిగ్రామ్ – సాగర్ వై.వి.విలను ముందుగా మెచ్చుకోవాలి. గ్రామీణ వాతావరణాన్ని, అక్కడి మనుషుల్ని, వ్యవహారాల్ని, పరిస్థితుల్ని సహజంగా తెరకెక్కించారు. దర్శకుడు రాసుకొన్న సన్నివేశాన్ని తెరపై అంతే హృద్యంగా చూపించడం అనేది అంత సులువైన విషయం కాదు. అందులో ఈ సినిమాటోగ్రాఫర్ల ద్వయం వందశాతం విజయం సాధించారు. కాకర్ల ధర్మేంధ్ర-గిరిజాల రవితేజల ఎడిటింగ్ సినిమాకి మరో ఎస్సెట్. సన్నివేశంలోని ఎమోషన్ ను పర్ఫెక్ట్ గా ఎలివేట్ అయ్యేలా చేశారు. అందువల్ల ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా ల్యాగ్ అనిపించదు.
సంగీత దర్శకుడు సత్యవోలు శిరీష్ అందించిన బాణీలు, నేపధ్య సంగీతం హృద్యంగా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఆఫ్ బీట్ రిడంప్షన్ మనసుని హత్తుకుంటుంది. ఇంత వినసోంపైన సంగీతాన్ని, సన్నివేశానికి తగ్గ నేపధ్య సంగీతాన్ని విని చాలా నెలలైంది. కుదిరితే ఒరిజినల్ సౌండ్ ట్రాక్ విడుదల చేస్తే బాగుంటుంది. ఇక దర్శకుడు ప్రవీణ్ రాసుకున్న కథ కంటే సదరు కథను నడిపించిన స్క్రీన్ ప్లే, సీన్ కంపోజిషన్ అద్భుతంగా ఉన్నాయి. అసలు సినిమాలు ఇంత సహజంగా ఎలా తెస్తారు అనిపిస్తుంటుంది చూస్తున్నంతసేపూ. పాత్రల్లో ఒక అమాయకత్వం, సన్నివేశాల్లో నిజాయితీ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. దర్శకుడిగా ప్రవీణ్ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్ని తనవైపుకి తిప్పుకున్నాడు.
విశ్లేషణ: సినిమా ఇండస్ట్రీ మీద ఆసక్తి ఉన్న, సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరి హృదయాల్ని ఆకట్టుకొనే చిత్రం “సినిమా బండి”. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని తప్పకుండా చూడండి. ఎందుకంటే.. ఎమోషనల్ గా ఎంటర్ టైన్ చేసే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి.