అది నేను కాదు.. ఎవరూ నమ్మొద్దు.. గత కొన్ని రోజులుగా సినిమా పరిశ్రమలో ఈ మాట అంటున్న హీరోయిన్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మార్ఫింగ్ ఫొటోలు, డీప్‌ఫేక్ వీడియోలతో గత కొన్ని రోజులుగా చాలా ఇబ్బందులు పడిన స్టార్ హీరోయిన్లు, హీరోయిన్లు ఇప్పుడు మరో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. అదే ఫేక్ వాట్సాప్ అకౌంట్లు. దీంతో ‘ఇది నా నంబరు కాదు’ అని అభిమానులు, నెటిజన్లకు రిక్వెస్ట్‌లు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు ఇలాంటి రిక్వెస్ట్‌లు చేయగా.. మరో హీరోయిన్ ఈ లిస్ట్‌లో చేరింది.
తొలుత అదితిరావు హైదరి ఈ ఫేక్ అకౌంట్ల గురించి మాట్లాడింది. తన పేరు మీద ఎవరో ఫేక్ ఖాతా తెరిచారు, ఎవరూ ఆ ట్రాప్‌లో పడొద్దు అని చెప్పారామె. ఆ తర్వాత శ్రియ శరన్ కూడా ఇదే విధంగా స్పందించింది. అభిమానులు అప్రమత్తంగా ఉండాలని ఆమె కూడా కోరింది. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ కూడా ఇలాంటి పోస్టు పెట్టింది. దీంతో ఈ సమస్య రోజురోజుకు పెరుగుతోందని అర్థమవుతోంది.

అసలేం అవుతోంది అంటే.. హీరోయిన్ల పేరిట కొంతమంది కేటుగాళ్లు మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పేరు, ఫొటోతో ఫేక్ వాట్సాప్ ఖాతాలు క్రియేట్ చేస్తున్నారు. ఆ హీరోయినే మెసేజ్ చేస్తోంది అనేలా మాయ మాటలు చెబుతున్నారు. ఫొటోషూట్ అంటూ ఫొటోగ్రాఫర్ల నుంచి కాసులు కాజేసేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఈ విషయాలు ఆ హీరోయిన్ల వరకు వెళ్లేసరికి తమకెలాంటి సంబంధం లేని ఆయా నంబర్ల నుండి వచ్చే మెసేజ్‌లు నమ్మొద్దని హీరోయిన్లు చెప్పాల్సి వస్తోంది.

ఫొటోషూట్ లాంటి వాటి కోసం ఎవరినైనా కాంటాక్ట్ అవ్వాలన్నా.. నేను వ్యక్తిగత ఫోన్ నంబరు వాడను. నా టీమ్ ద్వారానే సంప్రదిస్తా. ఒకవేళ మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తే.. మా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా arhconnectకి తెలియజేయండి అని అదితి ఇప్పటికే కోరింది. ‘ఇలా జరగడం బాధగా ఉంది. నా సన్నిహితులకు, నేను కలసి వర్క్ చేయనున్న వారికీ ఇలా మెసేజ్‌లు చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండండి’ అని శ్రియ చెప్పింది. ఇప్పుడు రకుల్ అయితే తన పేరు చెప్పి ఎవరైనా మెసేజ్ చేస్తుంటే వెంటనే బ్లాక్ చేయాని విజ్ఞప్తి చేసింది.
