గతంలో ఎన్నడూ లేనంతగా ఇద్దరు స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ నడుస్తుంది. మహేష్, అల్లు అర్జున్ సంక్రాంతి చిత్రాల విషయంలో ఇద్దరి మధ్య అనారోగ్యకరమైన వాతావరణం నెలకొంది. విడుదల తేదీలు, థియేటర్ల సర్దుబాటు విషయంలో మొదలైన ఇగో గోల, సినిమా విడుదల తరువాత మరింతగా పెరిగింది. స్టార్ డమ్ లో నువ్వెంత అంటే… నువ్వెంత.. అనుకునేంతగా వీరి మధ్య వైరం నడుస్తుంది. అందుకే ఒక దశలో ఒకే రోజు వచ్చి తేల్చుకుందాం అనేవరకు వెళ్ళింది వీరి వ్యవహారం. ఐతే నిర్మాతలు, సినిమాలు కొనుకున్న డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టం చేకూర్చే వ్యవహారం కావడంతో సంధి చేసుకొని ఒక రోజు వ్యవధిలో థియేటర్స్ లో దిగారు. ఇక విడుదల తరువాత వీరి మధ్య కలెక్షన్స్ వార్ మొదలైంది.
మాది రికార్డు అంటే మాది రికార్డ్ అని కొట్టుకుంటున్నారు. ఇద్దరు కలెక్షన్స్ పోస్టర్స్ పై నాన్ బాహుబలి అని వేసుకుంటున్నారు. అసలు బాహుబలి అనేది లేకపోతే వీరిద్దరూ కలెక్షన్స్ పోస్టర్స్ మరో స్థాయిలో ఉండేవి. నిజానికి తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇండియా బాక్సాపీస్ కలెక్షన్స్ కి ఖచ్చితమైన పెరామీటర్స్ లేవు. మన నిర్మాతలు, పి ఆర్ ఓ లు ప్రచారం చేసుకునే లెక్కల అంకెలు అంచనాలు మాత్రమే. ఒక హీరో ఇమేజ్, మార్కెట్ పెంచడానికి ఈ మధ్య ఫేక్ కలెక్షన్స్ ట్రెండ్ ఎక్కువైపోయింది. ఇండియాలో మాకు ఇంకా పెట్టుబడి కూడా రాలేదు మహా ప్రభో…అని సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ లబోదిబో మంటుంటే నిర్మాతలు మాత్రం ఏరియాల వారీగా వారికి ఇష్టం వచ్చిన అంకెలు ప్రకటిస్తూ ఉంటారు.సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో ఖచ్చితంగా హిట్ చిత్రాలు, అందులో సందేహం లేదు. కానీ వారు చెవుతున్న కలెక్షన్స్ ఫిగర్స్ లోనే పారదర్శకత లేదు. క్లీన్ హిట్స్ అందుకున్న ఈ హీరోలు ఇద్దరు, ఫేక్ కలెక్షన్స్ వార్ ప్రారంభించి పరువు పోగొట్టుకుంటున్నారు.