పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న హరర్ కామెడీ చిత్రం ‘రాజా సాబ్’ (The Raja saab) మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మారుతి (Maruthi Dasari) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొదటి నుంచి అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించినా, ఈ మధ్య ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అందరిలో నిరాశ మొదలైంది. ఇటీవలే మారుతి సోషల్ మీడియాలో స్పందించి, విఎఫ్ఎక్స్ కారణంగా ఆలస్యమవుతోందని చెప్పారు. కానీ అందుకు మించిన మినహాయింపులు కూడా ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వార్త ప్రకారం, ఈ సినిమాను 3డి ఫార్మాట్‌లోకి మార్చే ఆలోచన జరుగుతోందట. ఇది నిజమైతే, సినిమాకు మరో మూడు నెలలు ఆలస్యం కావొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి బాలీవుడ్ లోని ఓ స్టూడియోతో అభిప్రాయ భేదాలు తలెత్తాయని గాసిప్స్ వినిపిస్తున్నాయి. పైగా బడ్జెట్ పెరగడంతో సమస్యలు ఎక్కువైనట్లు టాక్.
అయితే ఇవన్నీ అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయిందని సమాచారం. కొన్ని పాటలు, కొన్ని ముఖ్యమైన సీన్లు మాత్రమే బ్యాలెన్స్‌లో ఉన్నాయట. మలవికా మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో కామెడీ, హరర్, ఎమోషన్ అన్నీ మిక్స్‌గా ఉండనున్నాయట. అయితే, 3డి ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ వల్ల బడ్జెట్ భారీగా పెరిగిందట.
మొత్తానికి ‘రాజా సాబ్’ సినిమాకు సంబంధించిన అప్డేట్లు, ప్రోగ్రెస్ స్పష్టంగా బయటపెట్టకపోవడమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. మారుతి మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేస్తున్న తరుణంలో, ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడం ఫ్యాన్స్‌కి అసంతృప్తిని కలిగిస్తోంది. ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వడం సినిమా యూనిట్ బాధ్యతగా మారింది. మరి రిలీజ్ డేట్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.