నంది అవార్డుల వివాదం రోజు రోజుకి పెద్దదవుతోంది. నిన్న బన్నీ వాసు ” ఏం .. మెగా హీరోలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసి కొత్తగా నటన నేర్చుకోవాలా? చంద్రబాబు సర్కారు వద్ద శిక్షణ తీసుకోవాలా?” అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. రుద్రమదేవి సినిమాకి అవార్డులు రాలేదని ప్రశ్నించడం తప్పా? అంటూ గుణశేఖర్ పెద్ద లేఖ రాశారు. డైరక్టర్ మారుతీ ట్విట్టర్ లో సొంతవారికి అవార్డులు ఇస్తున్న ఒక టీవీ కామెడీ వీడియోని పెట్టి తన వ్యతిరేకతను ప్రకటించారు. తాజాగా “కంచె” సినిమా సహా, చాలా సినిమాల విషయంలో “నంది” కమిటీ కేవలం కులం కోణంలోనే చూసిందనినిర్మాత నల్లమలుపు బుజ్జి అభిప్రాయపడుతున్నారు.
“ఇది ప్రభుత్వం ఇచ్చే అవార్డ్.. ఇది ప్రజలకు సంబంధించినది.. ప్రేక్షకులకు సంబంధించినది.. జాతీయ అవార్డులు వచ్చిన సినిమాల్ని కూడా నంది కమిటీ పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరం'”అన్నారు. మరో మెగా హీరో చిత్రం రేసుగుర్రం సినిమాకి కథ, కథనం, హీరో, హీరోయిన్, కొరియోగ్రఫీ.. ఇలా అన్ని కేటగిరీల్లోనూ అవార్డులు పొందే అర్హత వుందనీ, అలాంటి సినిమాకి అన్యాయం జరిగిందని నల్లమలుపు బుజ్జి ఆరోపించారు. చివరగా “అవి నంది అవార్డులు కావు, పంచేసుకున్న అవార్డులు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నటుడు, నిర్మాత బండ్ల గణేష్ “అవి సైకిల్ నందులు” అంటూ విమర్శించారు. నందుల వివాదం పరిష్కారానికి కమిటీ ఎటువంటి చర్యలు చేపడుతుందో చూడాలి.