సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీజర్, ట్రైలర్ విడుదల చేయడం అనేది ఆనవాయితీ. అది సినిమాని పుష్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక్కోసారి క్రేజ్ లేని కాంబినేషన్స్ పై కూడా ఇవి అంచనాలు క్రియేట్ చేయడానికి ఉపయోగపడ్డాయి. టీజర్, ట్రైలర్స్ వల్ల సినిమాలకి భారీ ఓపెనింగ్స్ వచ్చిన సందర్భాలు అనేకం. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వీటి అవసరం కూడా ఎక్కువైంది. ఒక్కోసారి వీటి డోస్ సరిపోలేదు అంటే.. రిలీజ్ ట్రైలర్ కూడా వదులుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఇవి చాలా ముఖ్యం అయిపోయాయి.
‘సలార్’ ‘కల్కి…’ ‘దేవర’ సినిమాలకి టీజర్, ట్రైలర్ వంటివి ఇంపాక్ట్ చూపలేదు. దీంతో రిలీజ్ ట్రైలర్ వదలాల్సి వచ్చింది. అయితే ఒకప్పుడు అంటే ‘మగధీర’ సినిమాకి ముందు ఈ టీజర్, ట్రైలర్ వంటివి పెద్దగా ఉండేవి కాదు. టీవీల్లో లేదంటే థియేటర్లలో టీజర్ లేదా ట్రైలర్స్ ప్రదర్శించేవారు. అవి లేకపోయినా కూడా రిలీజ్ సినిమాకి ఉండాల్సిన హడావుడి ఉండేది. ఇప్పుడు ఆ రోజులను వెనక్కి తీసుకురావాలని ‘కూలి’ టీం భావిస్తుంది.
వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘కూలి’ రూపొందింది. నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాపై తమిళంలోనే కాదు తెలుగులో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒక్క టీజర్ కూడా రాకుండానే బిజినెస్ మొత్తం క్లోజ్ అయ్యింది. నిర్మాతలు భారీ లాభాలు ఆర్జించారు. సో ‘కూలి’ పై ఎలాంటి హైప్ ఉందో తెలుపడానికి ఇంతకంటే ఎగ్జామ్పుల్ అవసరం లేదు.
అందుకే ‘కూలి’ టీజర్, ట్రైలర్ వంటివి రిలీజ్ చేయకుండానే సినిమా రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. ఇది కొత్త ప్రయత్నమే.. కొంతవరకు మంచి ప్రయత్నం అని కూడా చెప్పాలి. అలాగే ఇంకొంత వరకు రిస్క్ అని కూడా చెప్పొచ్చు. రిస్క్ ఎందుకంటే కథ, కథనాలపై అవగాహన కల్పించకుండా.. అంటే ఆడియన్స్ ని ప్రిపేర్ చేయకుండా జనాల పై సినిమా వదిలితే… ‘వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో’ అనేది కూడా సందేహమే.