పాటలు – హక్కులు.. గత కొన్నేళ్లుగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) ఈ విషయంలో పోరాటం చేస్తున్నారు. ఇప్పటివరకు 4500 పాటలకుపైగా స్వరాలందించిన ఆయన.. వాటి హక్కుల కోసం ఏకంగా మద్రాసు హైకోర్టు మెట్లెక్కారు. అయితే ఇటీవల జరిగిన వాదనల్లో భాగంగా హైకోర్టు కీలక ప్రశ్న వేసింది. దీంతో ఈ కేసులో ఆసక్తికర మలుపు తిరిగింది అని న్యాయ నిపుణులు అంటున్నారు. పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుంది అంటూ సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు తాజాగా ప్రశ్నించింది.
తన పాటలు ఉపయోగించుకోవడానికి.. ఎకో, ఏఐజీ తదితర సంగీత సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో కాపీరైట్ హక్కులు పొందకుండా కొందరు తన పాటలు ఉపయోగిస్తున్నారని ఇళయరాజా పిటిషన్ వేశారు. ఈ కేసు విషయంలో విచారించిన సింగిల్ జడ్జి.. ఆ పాటలకు సంబంధించి నిర్మాత నుండి హక్కులు పొంది ఇళయరాజా పాటలు ఉపయోగించడానికి సంగీత సంస్థలకు అధికారం ఉందని తేల్చింది. అలాగే ఆ పాటలపై వ్యక్తిగతంగా ప్రత్యేక హక్కు ఇళయరాజాకు ఉండదని కూడా చెప్పింది.
2019లో వచ్చిన ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఇళయరాజా అప్పీల్ చేశారు. దీనిపై అప్పుడు విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం ఇళయరాజా పాటలు ఉపయోగించకుండా మధ్యంతర నిషేధం విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సినిమా కాపీరైట్ నిర్మాత వద్ద ఉందని, వారితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పాటలు ఉపయోగించుకుంటాం అని ఎకో తరఫున అప్పీల్ దాఖలైంది. బుధవారం ఈ అప్పీల్‌పై విచారణ జరగ్గా.. సంగీతం సమకూర్చినందుకు ఇళయరాజాకు నిర్మాత వేతనం ఇవ్వడంతో ఆ హక్కు నిర్మాతకు చేరుతుందని వాదించారు.
అలాగే నిర్మాత వద్ద హక్కు పొందడంతో పాటలు తమకు సొంతమయ్యాయని కూడా చెప్పారు. ఆ వాదనలకు ప్రతివాదనగా.. ఇళయరాజా తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. సంగీతం సమకూర్చడం క్రియేటివిటీ పని అని, కాపీరైట్ చట్టం వర్తించదని తెలిపారు. దీంతో జోక్యం చేసుకున్న న్యాయమూర్తులు లిరిక్స్ లేకపోతే పాటలు లేవని, అలాంటప్పుడు గీత రచయిత కూడా ఆ పాటల హక్కు కోరితే ఏమవుతుందని ప్రశ్నించారు. అనంతరం కేసు విచారణను జూన్ రెండో వారానికి వాయిదా వేశారు. దీంతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది.