అతి తక్కువ టైంలోనే 50 సినిమాలు పూర్తిచేసి రికార్డు సృష్టించాడు అల్లరి నరేష్. ‘అల్లరి’ చిత్రంతో ఇ.వి.వి.సత్యనారాయణ కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన నరేష్.. ‘అల్లరి’నే ఇంటి పేరు మార్చేసుకునేంతలా మెప్పించాడు. ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరో అనే నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. నిర్మాతలకు, కొత్త దర్శకులకు పెద్ద దిక్కుగా ఉండేవాడు. కానీ అతని తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాక.. నరేష్ చేసిన సినిమాల్లో ఒక్క ‘సుడిగాడు’ పక్కన పెడితే అన్నీ నిరాశపరిచిన సినిమాలే.
దీంతో నరేష్ సరైన కథలు సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు అనే విమర్శలు ఎదుర్కొన్నాడు.చెప్పాలంటే నరేష్ ను అందరూ మర్చిపోయారనే చెప్పాలి. ఇలాంటి టైములో ‘మహర్షి’ చిత్రం ఇతన్ని ఆదుకుంది. ఇందులో మహేష్ బాబు స్నేహితుడిగా నటించి.. ఆ ఎకౌంట్ లో హిట్ అందుకున్నాడు. సినిమాలో మెయిన్ రోల్ కాబట్టి.. నరేష్ ను అందరూ బాగానే గుర్తుచేసుకున్నారు. మొత్తానికి ‘మహర్షి’ రిజల్ట్ తో నరేష్ పై మళ్ళీ ప్రేక్షకుల ఫోకస్ పడింది. ప్రస్తుతం అతను ‘నాంది’ ‘బంగారు బుల్లోడు’ సినిమాలు చేస్తున్నాడు.
ఇందులో ‘బంగారు బుల్లోడు’ ముందు రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు మహమ్మారి వల్ల థియేటర్లు మూతపడ్డాయి. ఒక వేళ తెరుచుకున్నా పెద్ద సినిమాలు మొదట రిలీజ్ అయ్యే అవకాశం లేదు. చిన్న సినిమాలనే ముందుగా విడుదల చెయ్యాలి అనుకుంటున్నారు. ఈ క్రమంలో నరేష్ ‘బంగారు బుల్లోడు’ చిత్రం.. ముందుగా విడుదల అవుతుంది అంటున్నారు. అలా అయితే మన అల్లరోడికి ఇది మంచి అవకాశమనే చెప్పాలి.ఆన్లైన్ లో సినిమాలు చూసి విసిగిపోతున్న ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తే అల్లరి నరేష్ హవా మళ్ళీ మొదలవుతుంది. మరి ఈ సువర్ణ అవకాశాన్ని నరేష్ ఎంతవరకూ ఉపయోగించుకుంటాడో చూడాలి.