బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి, సింగర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మనో,విలక్షణ నటుడు రాజా రవీంద్ర, భరణి..వంటి వారు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘క్రేజీ అంకుల్స్’.ఇ.సత్తిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పై విడుదలకు ముందే మంచి హైప్ ఏర్పడింది. ట్రైలర్, పాటలు వంటివి ఎంటర్టైనింగ్ గా అలాగే ప్రామిసింగ్ గా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల దృష్టి పడింది. మరి ఆ అంచనాలను ఈ చిత్రం ఎంత వరకు మ్యాచ్ చేసింది అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :
కథ: రాజు (రాజా రవీంద్ర), రెడ్డి (సింగర్ మనో), రావు (భరణి) అనే ముగ్గురు స్నేహితులు…కుటుంబ బాధ్యతలు మరియు కుటుంబ సభ్యుల కారణంగా తమ భార్యల నుండీ కోరుకునే చిన్న చిన్న ఆనందాలకు దూరమవుతారు. ఆ ఆనందాన్ని మరో విధంగా పొందాలని భావించి సోషల్ మీడియా వంటి వాటికి ఎడిక్ట్ అవుతారు.అదే టైములో వారు ఉండే అపార్ట్మెంట్ కి ఫేమస్ సింగర్ స్వీటీ (శ్రీముఖి) వస్తుంది. ఈమె పై మన ఆర్.ఆర్.ఆర్ అంకుల్స్ కన్నేస్తారు.ఎలాగైనా స్వీటీతో పరిచయం పెంచుకుని ఆమెతో ఎలాగైనా స్పెండ్ చేసి తమ కోరికను తీర్చుకోవాలని ప్లాన్ లు వేస్తారు. ఈ క్రమంలో వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?చివరికి వారు కోరుకున్నది దక్కిందా? లేదా? అనేది తెర పై చూడాల్సిందే.
నటీనటుల పనితీరు: సింగర్ మనో, రాజా రవీంద్ర, భరణి ముగ్గురూ కూడా మంచి నటన కనపరచడంతో పాటు కామెడీని కూడా చాలా బాగా పండించారు.రాజా రవీంద్ర ఎలాగూ సీనియర్ నటుడు. ఏ పాత్రనైనా అవలీలగా పోషిస్తాడు అన్న విషయం తెలిసిందే.అయితే మనోకి నటనలో పెద్దగా అనుభవం లేకపోయినా సీనియర్ ఆర్టిస్ట్ లానే మంచి హావభావాలు పలికించాడు.భరణి కి కూడా చాన్నాళ్ల తర్వాత ఎక్కువ నిడివి గల మంచి పాత్ర దొరికింది.దానిని అతను చాలా చక్కగా ఉపయోగించుకుని ప్రేక్షకుల చేత మంచి మార్కులు వేయించుకునే అవకాశం ఉంది.ఇక శ్రీముఖి ఆ ముగ్గురితో పోటీపడి మరీ నటించిందనే చెప్పాలి. బోల్డ్ సీన్స్ లో కూడా నటించి కుర్రకారుని మత్తెక్కిస్తోంది అనడంలో సందేహం లేదు.ఈమె పాత్ర ద్వారా వచ్చే ట్విస్ట్ లు కూడా ఆకట్టుకుంటాయి. ఇక యోగా గురువుగా పోసాని కూడా తన మార్క్ నటనతో మెప్పిస్తాడు.హేమ కూడా ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది.మిగిలిన నటీనటులకు పెద్దగా స్పేస్ లేకపోయినా ఉన్నంతలో పర్వాలేదు అనిపించారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు ఇ. సత్తిబాబు ఎప్పటిలానే ఈసారి కూడా ఎంటర్టైన్మెంట్ కే పెద్ద పీట వేసాడు. అయితే అక్కడక్కడా కొన్ని అనవసరపు సీన్లు పెట్టాడేమో అనిపిస్తుంది.అవి కూడా రిపీటెడ్ గా ఉండడంతో కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అయినప్పటికీ అవి కామెడీతో కవర్ అయిపోయాయి. ట్విస్ట్ ల పై అలాగే మెసేజ్ పై కూడా బాగానే ఫోకస్ పెట్టాడు.క్లైమాక్స్ పై కూడా ఇంకాస్త శ్రద్ధ పెట్టుంటే బాగుండేదేమో. హడావిడిగా ముగించేశారు అనే ఫీలింగ్ కలుగుతుంది.కానీ రన్ టైం 1 గంట 42 నిమిషాలే కాబట్టి ఇబ్బందిగా అనిపించదు. రఘు కుంచె అందించిన సంగీతం బాగుంది.బాల రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు. నిర్మాణ విలువలకు పేరు పెట్టనవసరం లేదు. ఎక్కడా కూడా చిన్న సినిమా ఇది అనే ఫీలింగ్ కలగదు. ఎడిటింగ్ విషయంలో కూడా ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్టు అయితే ఇందాక మనం మాట్లాడుకున్న అనవసరమైన సీన్లకు కత్తెర పడుండేది.
విశ్లేషణ: మొత్తంగా కొన్ని కొన్ని లాజిక్ లను పట్టికించుకోకుండా, స్టార్ క్యాస్ట్ కూడా లేరు అనే ఫీలింగ్ ను పక్కనపెట్టి కనుక ‘క్రేజీ అంకుల్స్’ కు వెళ్తే.. ఈ ఆర్.ఆర్.ఆర్ అంకుల్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు.