తెలుగు కల్ట్ హిట్ “అర్జున్ రెడ్డి” హిందీలో “కబీర్ సింగ్”గా రీమేకై నిన్న విడుదలైంది. జనరల్ ఆడియన్స్ బాగానే రిసీవ్ చేసుకొన్న ఈ చిత్రాన్ని అక్కడి క్రిటిక్స్ మాత్రం ఏకిపడేశారు. సరే ఒక సినిమా అందరికీ నచ్చాలన్న రూల్ ఏమీ లేదు. క్రిటిక్స్ మాత్రమే కాదు కొందరు ఫెమినిస్ట్స్ కూడా “కబీర్ సింగ్”ను భీభత్సంగా తిట్టిపోశారు. అసలు ఇదేం సినిమా, హీరోయిన్ అమ్మాయి అనుకొంటున్నావా లేక ఆట బొమ్మ అనుకొంటున్నావా? అని రకరకాలుగా సినిమాని తిట్టారు. సరే సినిమా వాళ్ళకి నచ్చలేదేమో.. ఇక్కడవాళ్ళకి నచ్చిన సినిమా అక్కడివాళ్ళకి నచ్చాల్సిన అవసరం లేదులే అనుకోని సరిపెట్టుకొన్నారు తెలుగు సినిమా ప్రేక్షకులు.
కానీ.. సదరు సోకాల్డ్ క్రిటిక్స్ & ఫెమినిస్ట్స్ అందరూ సినిమాని తిట్టడంతో పరిమితమవ్వకుండా.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మీద పడ్డారు. “అసలు ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎలా హిట్ చేశారు?, వాళ్ళకి మంచి టేస్ట్ అనేది లేదా?” అని తెలుగు ప్రేక్షకులను, వారి అభిరుచుల్ని కించపరచడం మొదలెట్టారు. మరి కబీర్ సింగ్ అనే సినిమా నిజంగా బాలేదా లేక ఒక తెలుగు రీమేక్ ను ఒక తెలుగువాడు అంత నిజాయితీగా తీయడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారా అనేది తెలియడం లేదు. కానీ.. సదరు సౌత్ ఆడియన్స్ కానీ క్రిటిక్స్ కానీ అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఒక తెలుగు సినిమా బాగుంది అంటే హిందీ ఆడియన్స్ చూస్తారో లేదో కానీ ఒక హిందీ సినిమా బాగుంది అని టాక్ వస్తే మాత్రం తెలుగు ప్రేక్షకులు తప్పకుండా చూస్తారు. అసలు ఈ ప్రపంచలో తెలుగు ప్రేక్షకులకు ఉన్న సినిమా పిచ్చి మరొకరికి లేదు, వాళ్ళకి భాషా బేధం లేదు.. సినిమా బాగుంది అంటే చాలు థియేటర్లకు పరుగులు తీస్తారు. బాలీవుడ్ డైరెక్టర్సే చాలా సార్లు “ప్రపంచంలోనే ది బెస్ట్ ఆడియన్స్.. తెలుగు ఆడియన్స్” అని పొగిడారు. అలాంటి తెలుగు ఆడియన్స్ ను బాలీవుడ్ జనాలు తక్కువ చేసి మాట్లాడడం అనేది ఏమాత్రం మంచిది కాదు. ఈ విషయాన్ని వాళ్ళు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.