సినిమాకు బాగా ప్రచారం చేసి.. తొలి రోజు థియేటర్లకు ప్రేక్షకుల్ని తీసుకురావడం ఎంత అవసరమో, అలా వచ్చిన జనం సినిమాను చూసి మెచ్చుకుని మరికొంతమందికి దాని గురించి చెప్పి వాళ్లు థియేటర్లకు వచ్చేలా చేయడమూ అంతే అవసరం. ఇందులో తొలి స్టెప్‌ను బాగా చేసి.. రెండో స్టెప్ దగ్గర ఇబ్బంది పడిన సినిమా ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్‌సేన్ హీరోగా రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. విశ్వక్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ సినిమా మరి ఓటీటీలో ఏం చేస్తుందో చూడాలి.
సెకండ్ హాఫ్ కి పిచ్చెక్కిపోతారు, సీట్ల అంచున కూర్చుంటారు.. అంటూ విశ్వక్ సేన్ ప్రమోట్ చేసిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’(Das Ka Dhamki) . ఈ సినిమా థియేటర్ల దగ్గర అదరగొడుతోంది అని తొలి రోజు టాక్ వినిపించింది. అయితే ఏమైందో ఏమో వీకెండ్ అయిపోయేసరికి సినిమా కలెక్షన్లు వీక్ అయిపోయాయి. అందుకే థియేట్రికల్ రన్ ముగించి ఓటీటీ రన్‌కు డేట్ ఫిక్స్ చేసేశారు. ఏప్రిల్ 14న ఆహా లో ఈ సినిమా ప్రీమియర్ మొదలు కానుంది. అంటే మూడు వారాలు తిరగ్గానే ఓటీటీలోకి వచ్చేస్తోంది అన్నమాట.
అయితే, ఈ సినిమా ఓటీటీ డేట్‌తో టాలీవుడ్ నిర్మాతలు థియేటర్‌కు, ఓటిటికి మధ్య గ్యాప్ విషయంలో తామే పెట్టుకున్న నిబంధనలు పాటించడం లేదని అర్థమైపోయింది. ఆల్రెడీ ఆహా దగ్గర ‘ఓరి దేవుడా’, ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ‘దాస్ కా ధమ్కీ’ రావడంతో విశ్వక్ మూడో అందులో చేరినట్లు అయ్యింది. కృష్ణదాస్ (విశ్వక్ సేన్) అనాథ. ఓ స్టార్ హోటల్‌లో వెయిటర్‌గా చేస్తుంటాడు. ఒక రోజు హోటల్‌కు వచ్చిన కీర్తీ (నివేదా పేతురాజ్)తో ప్రేమలో పడతాడు. వెయిటర్ అనే విషయం దాచి తానొక పెద్ద ఫార్మా కంపెనీకి సీఈవో అని చెబుతాడు.
ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో రోడ్డు మీదకు పడిపోఏ పరిస్థితి వస్తుంది కృష్ణదాస్‌కు. అప్పుడే సిద్ధార్థ్ మల్హోత్రా (రావు రమేష్) వచ్చి, తన అన్నయ్య కొడుకు సంజయ్ రుద్ర (విశ్వక్ సేన్) క్యాన్సర్ చికిత్సకు ఓ మందు కనిపెట్టాడని, రీసెర్చ్ మధ్యలో చనిపోయాడని చెబుతాడు. అతడిలా నటించమని చెబుతాడు. అతడి స్థానంలోకి కృష్ణదాస్ వెళ్లిన తర్వాత ఏమైంది? కీర్తి తన అసలు పేరు డాలి అనే నిజాన్ని దాచి కృష్ణదాస్ వెంట ఎందుకు పడింది? అనేదే కథ.