కన్నడలో ఘన విజయం సొంతం చేసుకున్న “దియా”కి రీమేక్ గా రూపొందిన చిత్రం “డియర్ మేఘ”. మేఘ ఆకాష్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రం కొన్ని ఒడిదుడుకులను తట్టుకొని ఎట్టకేలకు ఇవాళ (సెప్టెంబర్ 3) విడుదలైంది. మరి ఈ కన్నడ సినిమా తెలుగు రీమేక్ మన ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకోగలిగిందో చూద్దాం..!!
కథ: ఓ అందమైన ఇంట్రోవర్ట్ మేఘ స్వరూప్ (మేఘ ఆకాష్). తన సీనియర్ అర్జున్ (అర్జున్ సోమయాజులు)ని ప్రేమించి, అది చెప్పడానికి కూడా మొహమాటపడుతూ.. అతడ్ని దూరం నుంచే చూస్తూ టైమ్ పాస్ చేసేస్తుంటుంది. ప్రేమ విషయం చెబుదాం అనుకొనేలోపు కొన్ని విషాద సంఘటనల కారణంగా ముంబై వెళ్తుంది. అక్కడ ఆమెకు పరిచయమవుతాడు అదిత్ (అదిత్ అరుణ్).మేఘ లైఫ్ లోకి అదిత్ వచ్చాక కొన్ని మంచి మార్పులు వస్తాయి. అదే తరుణంలో ఊహించని విధంగా అర్జున్ మళ్ళీ మేఘ లైఫ్ లోకి సడన్ ఎంట్రీ ఇస్తాడు. ఈ ట్రాయాంగిల్ లవ్ స్టోరీ ఎటు సాగింది అనేది “డియర్ మేఘ” కథాంశం.
నటీనటుల పనితీరు: నటిగా మేఘ ఆకాష్ చాలా పరిణితి చెందింది అనే చెప్పాలి. ఈ సినిమా కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్రలో ఆమె జీవించేసిందనే చెప్పాలి. చాలా ఎమోషన్స్ ను సబ్టల్ గా ఆన్ స్క్రీన్ లో ప్రెజంట్ చేసింది. అయితే.. హావభావాల ప్రకటన విషయంలో ఒరిజినల్ నటిని కాపీ కొట్టేసింది. తనకంటూ ప్రత్యేకమైన శైలిని మాత్రం ఏర్పరుచుకోలేదు. అదిత్ అరుణ్ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ గా నిలిచాడు. తన ఎనర్జీ లెవెల్స్ తో పాత్రకు ప్రాణం పోసాడు. అర్జున్ సోమయాజులు పర్వాలేదు అనిపించుకున్నాడు. పవిత్ర లోకేష్ మరోసారి తల్లి పాత్రలో అలరించింది.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు సుశాంత్ రెడ్డి ఒరిజినల్ స్టోరీని స్క్రీన్ ప్లే పరంగా మార్చుకొనే ప్రయత్నం బాగుంది. అయితే.. స్క్రీన్ ప్లే విషయంలోనే కాక నేటివిటీ విషయంలోనూ కాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఒక తెలుగు సినిమా చూస్తున్నామనే ఫీల్ మాత్రం ఎక్కడా కలగలేదు. ఎమోషన్స్ ను పూర్తిస్థాయిలో ఎలివేట్ చేయలేకపోయాడు.
ఓవరాల్ గా డైరెక్టర్ & రైటర్ గా సుశాంత్ రెడ్డి బొటాబోటి మార్కులతో సరిపెట్టుకున్నాడనే చెప్పాలి. ఆండ్రూ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ పాయింట్. లైటింగ్ & ఫ్రేమింగ్స్ ఆకట్టుకుంటాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ విషయంలో తన మ్యాజిక్ చూపించలేదు. గౌర హరి నేపధ్య సంగీతం బాగుంది.
విశ్లేషణ: తెలుగు సినిమా “అందాల రాక్షసి”ని కాస్త ఫాస్ట్ ఫార్వార్డ్ చేసినట్లుగా ఉంటుంది కన్నడ “దియా”. ఆ చిత్రాన్ని తెలుగులో మళ్ళీ రీమేక్ చేయడం అనేదే పెద్ద రిస్క్. ఆ రిస్క్ ను కేవలం ఒటీటీకి పరిమితం అయ్యింటే బాగుండేది. కానీ.. థియేటర్లలో విడుదలవ్వడం, భారీ తారాగణం ఎవరూ లేకపోవడం, తెలిసిన కథ కావడంతో సినిమాను థియేటర్లో రెండు గంటలపాటు కూర్చుని చూడడం కాస్త ఓపికతో కూడుకున్న పని అనే చెప్పాలి. ఒరిజినల్ వెర్షన్ చూసారా లేదా అనేది పక్కన పెడితే.. ఒక సగటు ప్రేక్షకుడ్ని అలరించడంలో “డియర్ మేఘ” పూర్తిస్థాయిలో సఫలీకృతం కాలేకపోయింది.
రేటింగ్: 2/5