మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్‌లోను, యూట్యూబ్‌లోను మారుమోగుతున్న పాటల్లో ‘నీలాంబరి… నీలాంబరి… ’ ఒకటి. ‘ఆచార్య’లో రామ్‌చరణ్, పూజా హెగ్డే మధ్య ప్రణయ గీతమిది. ఈ గీతాన్ని ప్రేమ పాటల స్పెషలిస్ట్ అనంత శ్రీరామ్ రాశారనే విషయం తెలిసిందే. ఈ గీతం సగటు ప్రేమ పాటల్లాగా కాకుండా, వ్యవహారిక పదాలతో గంభీరంగా ఉండాలనుకున్నారట. అలానే పాటను సిద్ధం చేసి ఇప్పుడు ప్రేక్షకులకు శ్రవణానందం, మానసిక ఆనందం కలిగిస్తున్నారు. ఈ పాట గురించి ఆయన ప్రముఖ తెలుగు దినపత్రికతో మాట్లాడారు.
‘ఆచార్య’లో పూజా హెగ్డే పేరు నీలాంబరి అట. ఆ పేరుతోనే పాట కావాలని దర్శకుడు కొరటాల శివ అడిగారట. దీంతో సంగీత దర్శకుడు మణిశర్మ నీలాంబరి అనే పదం పెట్టుకుని ట్యూన్ చేశారు. నీలాంబరి పదాన్ని గౌరవించి అంత్యానుప్రాసాలంకారంలో ‘రి’తో పాట పంక్తులు పూర్తయ్యేలా రాసుకున్నారట అనంత శ్రీరామ్. మొదట ఈ పాట కోసం నాలుగు పల్లవులు రాశారట. ఇప్పుడు వింటున్నది ఫైనల్ చేశారట. అమ్మాయి అందాన్ని, తన అల్లరి లక్షణాన్ని చెప్పేలా ‘వేరెవ్వరే నీలా మరి… నీ అందమే నీ అల్లరి’ అని రాసుకున్నారట రచయిత.
ఆమె అల్లరే ఆమెకి అందం అని చెప్పే ప్రయత్నమది. ఈ పాటలో హీరో శైలి బిడియంతో మొదలై చొరవ నుండి తెగువ వరకు వెళ్తుంది. వల్లరి అంటే కొమ్మ అని అర్థం. షరబత్ నన్నారి అనే పానీయాన్ని గుర్తు చేస్తూ నన్నారి, అందమైన అమ్మాయి అంటూ అభివర్ణించడం కోసం చోకిరి అనే పదాల్ని పాటలో వినియోగించారట.ఇక పాటకు వచ్చిన స్పందన గురించి అనంత శ్రీరామ్ తెలియజేస్తూ… విడుదలైన తర్వాత ఆయనకు చిరంజీవి ఫోన్ చేశారు. ‘గొప్ప మెలోడీ ఇచ్చావని మణిశర్మకి ఫోన్ చేసి మాట్లాడా. అయినా నాకు సంతృప్తిగా అనిపించలేదు. ఈ పాటలో సంగీతంతోపాటు సాహిత్యం పోటీ పడింది. అందుకే నీకు కూడా ఫోన్ చేశా అనంత్’ అని చెప్పారట.