నటుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పటివరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన కమల్ హాసన్ ఇప్పుడు రాజకీయాల్లో బిజీ అయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం పార్టీ.. మరికొన్ని పార్టీలతో కలిసి పోటీ చేయనుంది. ఈ సందర్భంగా కమల్ కోయంబత్తూర్ దక్షిణం నుండి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. దీనికోసం సోమవారం నామినేషన్ వేశారు.
నామినేషన్ పత్రాల్లో కమల్ సమర్పించిన ఆస్తుల వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మొత్తం తనకు రూ.176.93 కోట్ల విలువగల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో ఆయన పేర్కొన్నారు. వాటిలో స్థిరాస్తుల విలువ రూ.131. కోట్లు కాగా.. చరాస్తులు రూ.45.09 కోట్లు. వీటితో పాటు లండన్ లో రూ.2.50 వేల డాలర్లు విలువ చేసే ఇల్లు, రూ.2.7 కోట్ల లగ్జరీ కారు, కోటి విలువైన బీఎండబ్ల్యూ కారు ఉందని అఫిడవిట్ లో పొందుపర్చారు. ఆస్తులతో పాటు అప్పులు కూడా ఉన్నాయని..
మొత్తం రూ.49.5 కోట్ల అప్పు ఉందని తెలిపారు. రూ.17.79 కోట్ల విలువైన వ్యవసాయ భూములు, చెన్నైలో రూ.92.05 కోట్ల విలువైన భవనాలు ఉన్నాయి. చెన్నైలో ఉన్న రెండు ఇళ్ల ఖరీదు రూ.19.5 కోట్లని చెప్పారు.