“ఖాకీ” లాంటి క్లాసిక్ హిట్ అనంతరం కార్తీ-రకుల్ ప్రీత్ జంటగా నటించిన చిత్రం “దేవ్”. బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అనురాగ్ కశ్యప్ దగ్గర శిష్యరికం చేసిన రజత్ రవిశంకర్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. అడ్వెంచరస్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: ఈ కాలమ్ నింపడానికి నేను ఆలోచించినంతసేపు కూడా డైరెక్టర్ కథ గురించి ఆలోచించి ఉండడు. దేవ్ (కార్తీ) ఒక రిచ్ ఫ్యామిలీలో ఏకైక కుమారుడు. చిన్నప్పటినుంచి తండ్రి తనలో నింపిన ఆత్మస్థైర్యంతో ప్రపంచంలోని రకరకాల ప్లేసులు ఎక్స్ ఫ్లోర్ చేస్తూ.. తన బర్త్ డేను కూడా ఒకేరోజు షేర్ చేసుకునే ఫ్రెండ్స్ తో హ్యాపీగా గడిపేస్తుంటాడు.
కుర్రాడు మరీ హ్యాపీగా ఉండడం ఇష్టం లేని ఫ్రెండ్ మనోడికి ఫేస్ బుక్ లో మేఘన పద్మావతి (రకుల్ ప్రీత్ సింగ్) ఫోటో చూపించి డిస్టర్బ్ చేస్తాడు. అప్పటివరకూ ప్రపంచాన్ని ఎక్స్ ఫ్లోర్ చేయడం కోసం తిరిగిన దేవ్.. అప్పట్నుంచి మేఘనను పడేయడం కోసం ఆమె వెంట తిరుగుతుంటాడు. కానీ.. ఇండిపెండెంట్ ఉమెన్ అయిన మేఘన తనకు కాబోయే భర్త పనీ పాటా ఏమీ చేయకుండా తనతోపాటే తిరగాలి అనుకుంటుంది. మన దేవ్ కేమో నాన్న బిజినెస్, తన సొంత కలలు చాలా ఉంటాయ్. కేవలం కుర్రాడికి తాను కాకుండా మరో పని ఉందనే కారణం చేత అతడ్ని వదిలేస్తుంది మేఘన.
ఎందుకొదిలేసిందో అర్ధం కానీ దేవ్ ఆమెను తలుచుకుంటూ కొండలు కోనలు తిరుగుతుంటే.. మేఘన మాత్రం మధ్యమధ్యలో ఏడుస్తూ సక్సెస్ ఫుల్ గా బిజినెస్ చేసుకుంటుంది. చివరికి ఈ ఇద్దరూ ఎలా, ఎందుకు, ఎక్కడ కలిశారు అనేది ‘దేవ్” కథాంశం.
నటీనటుల పనితీరు: హీరోగా కార్తీ, అతిమంచి తండ్రిగా ప్రకాష్ రాజ్, ఫ్రెండ్స్ గా అమృత శ్రీనివాసస్, ఆర్జే విగ్నేష్ కాంత్ చక్కగా నటించారు. కానీ.. ఏ ఒక్కరి క్యారెక్టర్ కి క్లారిటీ అనేది ఉండదు. అసలు కార్తీ ఏం ఎక్స్ ఫ్లోర్ చేయాలి అనుకుంటాడు? అతని ధ్యేయం ఏమిటి? పోనీ ఏ ధ్యేయం లేకపోవడం కూడా ఒక ధ్యేయమే అని సరిపెట్టుకోవాలనుకున్నాడా? చాలా ఇండిపెండెంట్ అని తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే కార్తీ ఎందుకని తండ్రి డబ్బు మీదే ఆధారపడి ఉంటాడు? ఇలా చాలా ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకలేదు.
ఇక రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్ కి ఉన్న కన్ఫ్యూజన్ మన రాజకీయ వ్యవస్థలో కనిపించదు. ఈ అమ్మాయిని చూసుకోవడానికి, 24 గంటలు తన చుట్టూ తిరగడానికి ఒకడు కావాలి. అంటే అమ్మాయి కోరుకున్నది సర్వెంట్ నా లేక లైఫ్ పార్ట్నరా అనేది అర్ధం కాదు. మళ్ళీ ఆమె క్యారెక్టరైజేషన్ ను జస్టిఫై చేయడం కోసం రాసుకున్న తల్లి పాత్ర చాలా బలహీనంగా ఉంటుంది. ఈమధ్యకాలంలో వచ్చిన వీకెస్ట్ ఉమెన్ రోల్స్ లో ఇది ఒకటి.
ఆర్జే విగ్నేష్ కాంత్ కాస్త కామెడీ చేయడానికి ప్రయత్నించాడు కానీ.. సాగుతున్న కథనం ఆ కామెడీని ఎంజాయ్ చేసే శక్తి ప్రేక్షకులకు ఇవ్వలేదు.
సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ ఆర్.వేల్ రాజ్ సినిమాకి ప్రాణం పెట్టాడు. మరీ కొత్తగా లేకపోయినా.. కెమెరా ఫ్రేమింగ్స్ అన్నీ చాలా ఫ్రెష్ గా, సింపుల్ గా ఉన్నాయి. సినిమాలో చెప్పుకోదగ్గ ఏకైక ప్లస్ పాయింట్ ఆయన సినిమాటోగ్రఫీ మాత్రమేనని చెప్పొచ్చు. హరీష్ జైరాజ్ ఎప్పట్లానే తన ఎలక్ట్రానిక్ ట్యూన్స్ తో ఆకట్టుకోవడానికి ప్రయత్నించాడు కానీ.. పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఇక వినడానికి బాగున్నాయి అనుకున్న రెండు పాటలు చూడ్డానికి బాగోలేవు. ఆ సాహిత్యానికి సన్నివేశానికి ఏమాత్రం సంబంధం లేదు.
నిర్మాణ విలువలు మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి. కాస్త గ్రాఫిక్స్ పరంగానూ ఖర్చు చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఇక దర్శకుడు రజత్ రవిశంకర్ విషయానికి వస్తే.. ఆయన అసలు కథగా హీరోహీరోయిన్లకు, నిర్మాతకు ఏం చెప్పి ఉంటాడనే ఆలోచన సినిమా చూసిన ప్రతి ఒక్కరి మెదళ్ళలో ట్యూమర్ కంటే దారుణంగా పాతుకుపోయి ఉంటుంది. కథ లేదు సరే కనీసం కథనం, పోనీ అదీ లేకపోతే క్యారెక్టరైజేషన్స్ అయినా ఉంటే సినిమాని కనీసం ఒక గంటైనా భరించగలిగేవాళ్లం. కానీ.. సినిమాలో అలాంటివేమీ లేకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్న ఆయన తన సినిమాను అడ్వెంచరస్ లవ్ ఎంటర్ టైనర్ అని ప్రొజెక్ట్ చేయడమే కాకుండా.. ప్రేక్షకులకు కూడా ఒక అడ్వెంచర్ చేసిన అనుభూతిని కలిగించాడు.
విశ్లేషణ: ముందు నుంచీ ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవనుకోండి. కానీ.. అసలు అంచనాలు ఏమీ లేకుండా థియేటర్ లోకి వెళ్ళినా పూర్తిస్థాయిలో నిరాశపరిచే చిత్రం “దేవ్”.