‘‘నేను నేనుగా లేనే.. నిన్న మొన్నలా…’ ఈ పాట గుర్తుందా? ‘మన్మథుడు’ సినిమాలో నాగార్జున ఈ పాట పాడితే.. అమ్మాయిలు ఫిదా అయిపోయారు. అబ్బాయిలు అయితే ఈ పాటను వాళ్ల లవర్ దగ్గర పాడేసుకున్నారు కూడా. అయితే మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి ఉంటే మన పాడలేకపోయేవాళ్లం కూడా. అంతేకాదు ఆ పాటను మనం ఆ సినిమాలో చూడలేం కూడా. అదెందుకు, ఏమైంది అనే విషయాన్ని దేవిశ్రీప్రసాద్ ఇటీవల చెప్పుకొచ్చారు.
దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన తొలి సినిమా గుర్తుందా? అదేనండీ ‘దేవి’. ఆ సినిమా కోసమే తొలుత ‘నేను నేనుగా..’ ట్యూన్‌ను సిద్ధం చేసుకున్నారట డీఎస్పీ. ఆ సినిమాలో ఏదైనా మంచి లవ్ సీన్ వస్తే అక్కడ ఈ ట్యూన్‌తో పాట వేద్దాం అనుకున్నారట. అయితే ఆ సినిమాలో అవకాశం దొరకలేదట. దాంతో ఆ ట్యూన్‌ను అలా పక్కన పెట్టేశారట. ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదట. ఆ తర్వాత చాలా రోజులకు ‘మన్మథుడు’ సినిమా కోసం బయటకు తీశారట.
దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పెద్ద హీరో సినిమాల్లో ‘మన్మథుడు’ ఫస్ట్. ఆ సినిమాలో మంచి లవ్ సిట్యువేషన్ వచ్చేసరికి ఆ ట్యూన్‌ను బయటకు తీసుకొచ్చారట. అయితే తొలుత పల్లవి వరకే సిద్ధంగా చేసుకోగా.. సినిమా కోసం వాడుకుంటాం అనుకునేసరికి పూర్తి ట్యూన్‌ను రెడీ చేసి వాడారట. అలా ఎంతో ఇష్టపడి చేసుకున్న ఆ ట్యూన్‌ను అలా నాగార్జున సినిమా కోసం వాడాను అని చెప్పారు దేవిశ్రీప్రసాద్.
‘మన్మథుడు’ సినిమాలోని ‘నేను నేనుగా లేనే నిన్న మొన్నలా…’ అనే పాటకు లిరిక్స్‌ను సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించారు. ఈ పాట సినిమాలో ఎంత స్పెషల్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ ఈ పాట గురించి చెప్పడంతో మరోసారి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా.. ఎందుకు ఈ పాటను మిస్ అయ్యేవారు అని అన్నామో.