కుల వివక్ష కథాంశంగా తెలుగులో సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అటువంటి నేపథ్యంలో వచ్చిన సినిమానే “దండోరా” (Dhandoraa). శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా మురళీకాంత్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. నిజాయితీగా చేసిన ప్రమోషన్స్ కంటే.. శివాజీ నోట ప్రీరిలీజ్ ఈవెంట్లో దొర్లిన మాట వల్లే “దండోరా” ఎక్కువగా జనాల్లోకి వెళ్లింది అని చెప్పాలి. మరి సినిమాగా “దండోరా” ఏమేరకు ఆకట్టుకుంది? అనేది చూద్దాం..!!

కథ: ఒక వర్గం జనాల బ్రతుకు మీద అజమాయిషీ చలాయించడమే కాదు.. వారి చావుల మీద సైతం తమ రుబాబు బరాయించాలని చూసే ఓ అగ్ర కులానికి చెందిన శివాజీ (శివాజీ) మరణిస్తాడు. అగ్ర కులానికి చెందిన వాడైనప్పటికీ.. సొంత కులానికి గౌరవం ఇవ్వలేదని అతడి శవాన్ని కూడా మైనారటీ కులం వాళ్ల మాదిరి పద్ధతిలోనే అంత్యక్రియలు చేయాలని అగ్రకుల పెద్దలు నిర్ణయిస్తారు.
ఆ నిర్ణయం శివాజీ కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టింది? ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం కోసం శివాజీ కుటుంబం ఏం చేసింది? అనేది “దండోరా” (Dhandoraa) కథాంశం.

నటీనటుల పనితీరు: సినిమాలో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పటికీ.. థియేటర్ నుండి బయటికి వచ్చే సమయానికి మాత్రం శ్రీ నందు ఇంపాక్ట్ ప్లేయర్ గా కనిపిస్తాడు. కొడుకుగా, తండ్రిగా, అన్నగా, కులహంకారం భరించలేని ఓ సగటు అగ్ర కులస్థుడిగా నందు చాలా వేరియేషన్స్ ను బాగా పండించాడు. నటుడిగా మంచి మార్కులు సంపాదించాడు.
సినిమా చూస్తున్నంతసేపు అసలు నవదీప్ ఎందుకు ఉన్నాడు సినిమాలో అనిపిస్తుంది. అయితే.. అతడి పాత్రకి ఇచ్చిన క్లోజర్ సినిమాకి మెయిన్ హైలైట్ అవుతుంది. నవదీప్ క్యారెక్టరైజేషన్ సినిమాకి రిలీజ్ లా వర్కవుట్ అవుతుంది.
శివాజీ పాత్ర “కోర్ట్” తరహాలోనే ఇందులోనూ చాలా లౌడ్ గా ఉంటుంది. అయితే.. రియలైజేషన్ పాయింట్ బాగున్నప్పటికీ.. డ్రామా ఇంకాస్త ఎమోషనల్ గా ఉంటే బాగుండు అనిపించింది.
రవికృష్ణ పాత్ర ఈ సినిమాకి సెంట్రల్ పాయింట్ అయినప్పటికీ.. ప్రెడిక్టబుల్ గా ఉండడంతో ఎగ్జైట్ చేయదు. అయితే.. నటుడిగా మాత్రం రవికృష్ణ కీలకమైన ఇంటర్వెల్ సీన్ లో గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు.
రాధ్య పాత్ర చిన్నదే అయినా.. ఆమె క్లైమాక్స్ లో చెప్పే డైలాగ్ కొన్నాళ్లపాటు గుర్తుండిపోతుంది. బిందు మాధవి పాత్రకి మంచి ఎమోషన్ ఉంది కానీ.. ఆమె చాలా కీలకమైన డైలాగ్స్ ను నత్తి(?) కారణంగా స్పష్టంగా పలకకుండా.. సగం మిగేయడం అనేది ఆ డైలాగ్స్ లో ఇంపాక్ట్ ను సైడ్ లైన్ చేసింది.
మానిక పాత్ర చాలా బరువైనది.. అయితే ఆ బరువును మోయడంలో ఆమె బాగా తడబడింది.

సాంకేతికవర్గం పనితీరు: మార్క్ కె.రాబిన్ ఈ సినిమాకి మెయిన్ హీరో అని చెప్పొచ్చు. ఒక్కో సందర్భాన్ని, ఎమోషన్ ను ఎలివేట్ చేసిన విధానం చాలా బాగా వర్కవుట్ అయ్యింది. ముఖ్యంగా దండోరా టైటిల్ సాంగ్ సినిమా యొక్క ఆత్మను ప్రేక్షకులకు పరిచయం చేసింది. అందుకు రచయిత కాసర్ల శ్యామ్ ను కూడా మెచ్చుకోవాలి.
సినిమాటోగ్రాఫర్ వెంకట్ ఆర్.శాఖమూరి లెన్స్ ఛాయిస్ బాగుంది. చాలా కీలకమైన సన్నివేశాలకు వైడ్ ఫ్రేమ్ ను వాడిన విధానం, లిమిటెడ్ బడ్జెట్ లో ఇంత క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చిన తీరు ప్రశంసార్హం. అలాగే.. కలరింగ్ విషయంలో తీసుకున్న కేర్ అనేది ప్రేక్షకులకి మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది.
సృజన అడుసుమిల్లి ఎడిట్ ప్యాటర్న్ బాగుంది. ముఖ్యంగా సీన్ టు సీన్ ట్రాన్సిషన్ చాలా సీమ్ లెస్ గా ఉంది. అయితే.. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అవ్వడం కాస్త క్లారిటీ మిస్ అయ్యింది.
దర్శకుడు మురళీకాంత్ ఎంచుకున్న కథలో నావల్టీ ఉంది. కథను మొదలుపెట్టిన విధానంలో షాక్ వేల్యూ ఉంది. అయితే.. కమర్షియాలిటీ కోసం ఇరికించిన కామెడీ సన్నివేశాలు పాటలు కథనానికి స్పీడ్ బ్రేకుల్లా మారాయి. అయితే చెప్పాలనుకున్న పాయింట్ ను మాత్రం నిజాయితీగా చెప్పాడు. అయినప్పటికీ.. ఎండింగ్ లో జస్టిఫికేషన్ విజువల్ గా చూపించి ఉంటే బాగుండేది. ఊరి ప్రజల కష్టాన్ని, వారికి దక్కిన విజయాన్ని నవదీప్ ఆనందకేళితో ముగించిన విధానం మెటాఫరికల్ గా బాగున్నా.. విజువల్ సాటిస్ఫాక్షన్ మిస్ అయ్యింది. అయితే.. దర్శకుడిగా, కథకుడిగా తన ఆలోచనాధోరణితో, బలమైన ఎమోషన్ తో కథను పండించి మెప్పించాడు.

విశ్లేషణ: కులం, జాతి, మతం ద్వారా సమాజంలో పాతుకుపోయిన భావజాలాన్ని ప్రశ్నించడం లేదా వేలెత్తిచూపడం అనేది అంత సులభమైన విషయం కాదు. అలాగని అందరూ మిన్నకుండిపోతే.. కొన్నాళ్ళకి మనుగడ కనుమరుగవుతుంది. అలా బలంగా కాకపోయినా.. నిక్కచ్చిగా సంధించిన ప్రశ్నాస్త్రమే “దండోరా”. కుల వివక్ష మనిషి యొక్క మానసిక స్థితిని ఎంతలా ప్రభావితం చేస్తుందో చూపిస్తూనే.. ఆ కులం లేని సమాజం ఎంత అందంగా ఉంటుందో చిన్నపాటి అవగాహన కల్పించిన చిత్రమిది. గొప్ప సినిమా అనడం కంటే బాధ్యతతో తీసిన నిజాయితీగల సినిమాగా “దండోరా” నిలిచిపోతుంది.

ఫోకస్ పాయింట్: కుల వివక్ష రహిత సమాజ నిర్మాణానికి శంఖారావం!
రేటింగ్: 3/5
