సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు ధనుష్ (Dhanush) , నయనతార (Nayanthara) మధ్య తాజాగా చెలరేగిన వివాదం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ విషయంలో ‘నానుమ్ రౌడీ ధాన్’ చిత్రానికి సంబంధించిన విజువల్స్ వాడకంపై ఇద్దరి మధ్య తీవ్ర ఆరోపణలు మొదలయ్యాయి. ధనుష్ తన డాక్యుమెంటరీకి అనుమతి ఇవ్వలేదని, పైగా రూ. 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసు పంపించాడని నయన్ ఆరోపించింది.
ఈ విషయంపై ధనుష్ ఇప్పటి వరకు సైలెంట్ గానే ఉన్నప్పటికీ, ఆయన తండ్రి కస్తూరి రాజా (Kasthuri Raja) స్పందించారు. “మేము మా పని మీద దృష్టి పెట్టాం. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, వివాదాల్లోకి దిగడానికి మాకు సమయం కూడా లేదు. నా కొడుకు కూడా తన పనిపై కట్టుబడి ఉంటాడు” అని ఆయన అన్నారు. నయనతార చేసిన తీవ్ర ఆరోపణలపై ప్రెస్‌ను ఎదుర్కొన్నప్పటికీ, ధనుష్ కుటుంబం ఈ వివాదంపై పెద్దగా స్పందించకూడదని నిర్ణయించినట్లు కనిపిస్తోంది.
నయనతార మాత్రం తన బహిరంగ లేఖలో ధనుష్ పై ఘాటుగా స్పందించింది. “మీ కుటుంబం నుంచి వచ్చిన సపోర్ట్ తోనే మాత్రమే మీరు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ఈ వివాదంలో మీరు చూపిన వ్యవహారం మీ అసలు స్వభావాన్ని బయటపెట్టింది” అంటూ ధనుష్ ను నేరుగా ఉద్దేశించి వ్యాఖ్యానించింది. విజువల్స్ వాడటానికి అనుమతి ఇవ్వకుండా ఆమె డాక్యుమెంటరీని ఆలస్యం చేశారని ఆరోపిస్తూ నయన్ తీవ్ర విమర్శలు చేసింది.
ఈ వివాదానికి సంబంధించి ధనుష్ లాయర్ కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. “చిత్ర నిర్మాతగా విజువల్స్ మీద ధనుష్ కి న్యాయపరమైన హక్కులు ఉన్నాయి. అనుమతి లేకుండా అవి వాడడాన్ని అంగీకరించలేం” అని ఆయన అన్నారు. కానీ, నయనతార డాక్యుమెంటరీ ఇప్పటికే నవంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవ్వడంతో ఈ వివాదం మరింత చర్చనీయాంశమైంది.