హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ (Aishwarya Lekshmi) అందరికీ సుపరిచితమే. తమిళంలో ఎక్కువగా సినిమాలు చేస్తుంటుంది. ‘పొన్నియన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan: I) ‘పొన్నియన్ సెల్వన్ 2’ (Ponniyin Selvan: 2) సినిమాలతో ఈమె రేంజ్ పెరిగింది. తెలుగులో కూడా సత్యదేవ్ (Satya Dev) నటించిన ‘గాడ్ సే’ (Godse), నవీన్ చంద్రతో (Naveen Chandra) ‘అమ్ము’ (Ammu) వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా ‘హనుమాన్’ (Hanu Man) ఫేమ్ నిరంజన్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తుంది.
ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె పెళ్లి గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. గతంలో ఈమె ఓ నటుడితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అతన్నే పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇందులో నిజం లేదని చెబుతూ ఆమె పెళ్లి గురించి ఊహించని కామెంట్స్ చేసింది.
ఐశ్వర్య లక్ష్మీ మాట్లాడుతూ.. “జీవితంలో నేను పెళ్ళే చేసుకోను. ఇది నేను తొందరపడి, ఎమోషనల్ గా చేస్తున్న కామెంట్స్ కావివి. ఎంతో ఆలోచించే ఈ మాట చెబుతున్నాను. ఎందుకంటే.. నేను చాలా మంది కపుల్స్ ని చూశాను . వాళ్లలో ఒకట్రెండు జంటలు తప్ప మిగిలిన జంటలు హ్యాపీగా లేరు. వాళ్లంతా రాజీ పడి జీవిస్తున్నారు.
ఈ పెళ్లిళ్ల వల్ల కెరీర్లో ముందుకు సాగలేకపోతున్నారు. అందుకే పెళ్లి చేసుకోకూడదు అని నేను డిసైడ్ అయిపోయాను. నిజానికి నేను 25 ఏళ్ళ వయసులోకి రాగానే మ్యాట్రిమోనీలో ప్రొఫైల్ పెట్టాను.గురువాయూర్ టెంపుల్లో చాలా పెళ్లిళ్లు చూశాను. అవి చూశాక నాకు కూడా పెళ్లిపై ఆశ కలిగింది. కానీ కెరీర్లో ఇక్కడి వరకు వచ్చాక పెళ్లి అసలు రంగు తెలిసొచ్చింది” అంటూ చెప్పుకొచ్చింది.