త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో మాటలు సూపర్ ఫేమస్. ఆయన రాసే పంచ్ లైనా, ప్రాసలైనా ప్రేక్షకులను గిలిగింతలు పెడతాయి. సినిమాలో కథా కామీషు సంగతెలా ఉన్నా ఆయన మాటల గారడీ, కామెడీ పంచ్ కోసం ఎగబడి చూసే సినిమాలు చాలా వున్నాయి. ఇక వేదికల మీద ఆయన చేసే సుదీర్ఘ ప్రసంగాలు,చెప్పే జీవిత సత్యాలు మళ్ళీ మళ్ళీ వినిపించాలనిపిస్తాయి. నిజానికి ఓ దర్శకుడికి ఉండవలసిన మొదటి లక్షణం అదే. తీసే కథలో కొత్తదనం, తెరకెక్కించడంలో పట్టు ఉన్నా లేకున్నా హీరోకి మాటలలో అద్భుతం చూపించి సినిమా ఒకే చేయించుకోవాలి. ఫలితం తర్వాత.. అవకాశం వస్తేనే నిరూపించుకోగలం. అలాగే సందర్భం ఉన్నా లేకున్నా అప్పుడప్పుడు నాలుగు పెద్ద పదాలు ఉపయోగించి ఆకాశానికి ఎత్తాలి.
టాలీవుడ్ లో త్రివిక్రమ్ జోరుకు ఇదే కారణం. ప్రస్తుతం ఆయన రెండు బడా ఫ్యామిలీ హీరోలను తన షెల్ఫ్ లో పెట్టుకున్నారు. అది మెగాస్టార్ ఫ్యామిలీ మరియు నందమూరి ఫ్యామిలీ. టాలీవుడ్ లో సగానికి పైగా స్టార్ హీరోలు ఈ రెండు కుటుంబాల నుండే ఉన్నారు. మెగా ఫ్యామిలీలో చిరు, చరణ్, పవన్, బన్నీ ఆయన ఒకే అంటే సినిమా ఛాన్స్ ఇవ్వడమే తరువాయి. అటు నందమూరి ఫ్యామిలీలో సూపర్ క్రేజీ హీరో ఎన్టీఆర్ సైతం ఆయన సన్నిహితులలో చేరిపోయారు.
ఇక మిగిలింది మహేష్, ప్రభాస్ మాత్రమే. ఒకప్పుడు మహేష్ కి త్రివిక్రమ్ బెస్ట్ ఫ్రెండ్ కాగా ఎందుకో ఇద్దరికీ చెడింది. ప్రభాస్ తో ఆయన మూవీ చేయలేదు. ఆ ఇద్దరిని కూడా లైన్ లో పెడితే త్రివిక్రమ్ మిషన్ పూర్తి అయినట్లే. సుకుమార్ రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ కొట్టి మరో సినిమా ఒకే చేయనడానికి రెండేళ్లు సమయం పడితే, అజ్ఞాతవాసి అనే డిజాస్టర్ తీసి ఎన్టీఆర్ తో ఆరు నెలలో సినిమా ఒకే చేయించాడు త్రివిక్రమ్. థట్ ఈజ్ పవర్ ఆఫ్ లౌక్యం..!