సినిమా ప్రచారం ఎప్పుడూ కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుంది. అయితే ఎక్కువగా పెద్ద సినిమాలే ఇలాంటి వైవిధ్యాన్ని చూపిస్తుంటాయి. అయితే అవి కాస్త కాస్ట్‌లీగానే ఉంటాయి. మరి చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? అవి జనాల్లోకి వెళ్లాలంటే ప్రచారం అవసరం. అయితే డబ్బు ఖర్చు పెట్టి చేసేంత పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో ఓ చిన్న సినిమా బృందం వైవిధ్యమైన ఆలోచన చేసింది. అదే ‘ఫ్రీ’ షో. అవును సినిమాను ఉచితంగా చూడొచ్చు.
సినిమాలో విషయం గురించి జనాలకు తెలియడానికి ప్రచారం బాగా ఉపయోగపతుంది. సినిమాలో ఏముందో చూచాయగా చెబుతూ ఉంటారు. దాంతో జనాలు సినిమాలకు వస్తారు. నచ్చితే ఇతరులకు చెబుతారు. ప్రచారాల్లో మేటి ప్రచారం ‘మౌత్ పబ్లిసిటీ’. ఇప్పుడు ‘ది కిల్లర్’ అనే సినిమా కూడా ఇదే ప్రయత్నం చేస్తోంది. వచ్చే నెల 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీక్‌సాయి హీరోగా పరిచయం అవుతూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ది కిల్లర్’.
డాలీషా, నేహాదేశ్ పాండే కథానాయికలుగా నటిస్తున్నారు. ఆవుల రాజుయాదవ్, సంకినేని వాసుదేవరావు నిర్మిస్తున్నారు. సెప్టెబరు 3న సినిమా విడుదల సందర్భంగా చిత్రబృందం తొలి రోజు మార్నింగ్ షోను ప్రేక్షకులకు ఉచితంగా చూపించాలని నిర్ణయించింది. అవును ‘‘విడుదల రోజు ఉదయం ఆట అన్ని థియేటర్లలో సినిమాను ఉచితంగా చూడొచ్చు. చూశాక మా సినిమా గురించి పదిమందికి చెప్పాలని ప్రేక్షకుల్ని కోరుతున్నాం’’ అంటూ చిత్రబృందం కోరింది.