తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నికల వేడి మొదలైంది. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (TFCC) ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ సారి అధ్యక్షుడి పదవి కోసం నిర్మాతలు దిల్‌రాజు, సి.కల్యాణ్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవల మీడియాతో మాట్లాడారు. తన ప్యానెల్ సభ్యులతో దిల్ రాజు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు. ఈ క్రమంలో రెగ్యులర్ రాజకీయాల గురించి కూడా మాట్లాడారు.
ఏ రాజకీయ పార్టీ తరఫున నిలబడినా తాను ఎంపీగా గెలుస్తానని దిల్ రాజు చెప్పారు. దీంతో ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఎగ్జిబిటర్లకు ప్రభుత్వాలతో కొన్ని సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించడానికి సరైన బృందం కావాలి. సరైన పద్ధతిలో సినిమా చిత్రీకరణలు జరపాలి. నటీనటులకు ఎలాంటి సమస్య వచ్చినా మా అసోసియేషన్‌తో సమన్వయం చేసుకోవాలి అని దిల్ రాజు అన్నారు. అలాగే టీఎఫ్‌సీసీ ఎన్నికల పోటీలో ఎలాంటి వివాదాలు లేవు అని చెప్పారు.
ఫిల్మ్ ఛాంబర్‌ను బలోపేతం చేసేందుకే మేం ముందుకు వచ్చాం. పరిశ్రమలో ప్రతి విభాగంలో సమస్యలున్నాయి. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న నిర్మాతలందరూ మా ప్యానెల్‌లోనే ఉన్నారు. 1560 మంది నిర్మాతలు సభ్యులుగా ఉన్న ఈ అసోసియేషన్‌లో రెగ్యులర్‌గా సినిమాలు తీసేవాళ్లు 200 మంది మాత్రమే. సినీ పరిశ్రమను బలోపేతం చేసుకోవాలంటే అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని దిల్ రాజు కోరారు.
అలాగే గిల్డ్ ఏర్పాటు విషయంలో దిల్ రాజు (Dil Raju( మాట్లాడారు. ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోవడానికి నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్‌లో సమస్య ఎదురైనప్పుడు యాక్టివ్‌గా 21 మంది సభ్యులతో గిల్డ్ ఏర్పాటు చేశాం. మిగతా 80 మంది అసోసియేట్ సభ్యులుగా ఉన్నారు. గిల్డ్‌పై ఇన్నాళ్లుగా ఎన్ని విమర్శలు వచ్చినా మౌనంగా ఉన్నాం. అలాగే ఫిల్మ్ ఛాంబర్ బైలాస్‌లో కొన్ని మార్పులు చేయాలి. ఛాంబర్‌లో సరైన వ్యక్తులు ఉంటేనే న్యాయం జరుగుతుంది అని దిల్ రాజు వెల్లడించారు.
ఇక అసలు రాజకీయాల గురించి మాట్లాడుతూ.. ఏ రాజకీయ పార్టీ తరఫున నిలబడినా తాను ఎంపీగా గెలుస్తానని అన్నారు దిల్ రాజు. అయితే తన ప్రాధాన్యత ఎప్పటికీ సినిమా రంగానికే ఉంటుందని దిల్ రాజు స్పందించారు. అలాగే సీనియర్లు ముందుకు రాకపోవడంతోనే ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగినట్లు దిల్ రాజు చెప్పారు.