‘వకీల్ సాబ్’ సినిమా ఎలా ఉండబోతోంది? చాలామందిలో ఈ ప్రశ్న ఉంది. హీరో, డైరక్టర్, నిర్మాత, అభిమానులు… ఇలా అందరినోటా ఇదే మాట. ఎందుకంటే ఈ సినిమా ఫలితం మీద చాలా విషయాలు ఆధారపడి ఉన్నాయి. ఒకవైపు పవన్ కల్యాణ్‌కి ఇది రీఎంట్రీ సినిమా. మరోవైపు దర్శకుడు వేణు శ్రీరామ్‌కి హిట్ కావాల్సిన టైమ్. ఇదొస్తేనే తర్వాతి సినిమా ఈజీగా ఫిక్స్ అవుతుంది. ఇక నిర్మాత విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే సినిమా కోసం దిల్ రాజు గట్టిగానే ఖర్చు పెట్టారని వార్తలొస్తున్నాయి. ప్రచారానికి కూడా బాగానే ఖర్చవుతోంది.
పవన్ సినిమా కదా.. కంగారు పడక్కర్లేదు అని అనుకోవచ్చు. అయితే ‘పింక్’ సినిమాను అలా తీసేసుంటే ఎవరికీ డౌట్ ఉండేది కాదేమో. తమిళంలో పెద్ద ఎక్కువ మార్పులు చేయకుండా ‘నేర్కొండ పార్వాయి’గా తీసి మంచి విజయం అందుకున్నారు. అయితే తెలుగులోకి వచ్చేసరికి చాలా మార్పులు చేశారు. సినిమాలో నాలుగు పాటలకు స్థానం ఇచ్చారు. ఒక హీరోయిన్‌ని పెట్టారు. హీరోతో లవ్ ట్రాక్ పెట్టారు. ఫైట్లు పెట్టినట్లు ప్రచార చిత్రాలు చూస్తే తెలుస్తోంది. మరి ఇంత మార్పులు చేసినప్పుడు రిస్క్ చేసినట్లే కదా.
మాతృక ‘పింక్’కి ‘వకీల్‌సాబ్’కి చాలా మార్పులు ఉన్నాయని టీమ్ చెబుతోంది. అయితే ఆ మార్పులు వల్ల సినిమా ఇంకా బెస్ట్ వెర్షన్‌గా మారిందని అంటున్నారు. అయితే ఆత్మలో మార్పులు చేసి… మంచి సినిమా తీసుకురాకూడదు అని కాదు. జాగ్రత్తలు అయితే అవసరం. దిల్ రాజు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగానే ఉంటాడు. అయితే రెండు రీమేక్‌లు (మరో చరిత్ర, జాను) విషయంలో దెబ్బ తిన్నారు. మరి ఈసారి ఏం చేస్తారో.