సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. ఎన్టీఆర్, ఎం.జి.ఆర్, జయలలిత.. ఇలా లిస్ట్ తీస్తే చాలా మంది ఉంటారు. రామోజీరావు సైతం రాజకీయాలను శాసించగల వ్యక్తి అని కొంతమంది అంటుంటారు. ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు ఎక్కువయ్యాయి. సినీ పరిశ్రమలో దిల్ రాజు చాలా రాజకీయాలు చేస్తుంటారు. తన సినిమా కోసం వేరే సినిమాని పోస్ట్ పోన్ చేయించడం లేదా రెండు పెద్ద సినిమాల యూనిట్లు ఒకేసారి రిలీజ్ డేట్ లు అనౌన్స్ చేస్తే..
మీటింగ్ ఏర్పాటు చేసి రాజీ కుదర్చడం వంటివి ఎన్నో చేస్తుంటారు. మొన్నామధ్య జగన్ ప్రభుత్వం.. ఆంధ్రాలో టికెట్ రేట్లు ఘోరంగా తగ్గించేస్తే.. దిల్ రాజు కొంతమంది నిర్మాతల్ని వెంటేసుకుని పదే పదే మంత్రి పేర్ని నాని వంటి వారిని పరిష్కారం కోసం కలిసొచ్చేవారు. సో ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వెళితే.. అక్కడ చక్రం తిప్పడమే కాకుండా సినీ పరిశ్రమకు కూడా ఏదైనా అత్యవసరం వస్తే అండగా నిలబడతాడు అని అంతా భావిస్తున్నారు.
తాజాగా తన పొలిటికల్ ఎంట్రీ గురించి దిల్ రాజు (Dilraju) కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. ఆయన మాట్లాడుతూ.. “నేను రాజకీయాల్లోకి రావాలంటూ చాలా ఆఫర్లు వస్తున్నాయి. ఆ మాట నిజమే. కానీ నేను రాజకీయాల్లోకి వెళ్ళను. సినిమా పరిశ్రమలో ఈ పొజిషన్లో ఉంటేనే నన్ను విమర్శించడానికి ఓ బ్యాచ్ రెడీగా ఉంటారు. వాళ్ళ విమర్శలు ఎదుర్కోవడానికే చాలా బాధేస్తుంది.
ఇక రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ విమర్శలు ఎదుర్కోవాలంటే నా వల్ల కాదు. నేను అస్సలు తట్టుకోలేను” అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దిల్ రాజు రాంచరణ్ తో ‘గేమ్ ఛేంజర్’ అనే భారీ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కుతున్న 50వ చిత్రం కావడం విశేషం.