మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. శృతి హాసన్ కథానాయికగా నటించిన ఈ మూవీ జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లో భాగంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అవి మీకోసం :
ప్ర.మొదటిసారి మీ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది.. అది కూడా భారీ పోటీలో? ఎలా ఫీలవుతున్నారు?
బాబీ : కొంచెం ఎక్సైటింగ్ గా ఉంది.. టెన్షన్ అయితే ఏమీ లేదు.బహుశా వేరే నిర్మాతలు అయితే టెన్షన్ ఉండేదేమో..కానీ ఇప్పుడు సేమ్ నిర్మాతలు కాబట్టి రెండు ఫలితాలు బావుండాలని పాజిటివ్ గా కోరుకుంటున్నాం.
ప్ర.’వాల్తేరు వీరయ్య’ ఎలా స్టార్ట్ అయ్యింది ?
బాబీ : ‘గీతా ఆర్ట్స్’ ఆఫీస్ లో చిరంజీవి గారికి ఒక ఫ్యాన్ బాయ్ గా కలిశాను. 2003 లో నా జర్నీ మొదలైయింది. చిరంజీవి గారి సినిమాలో పని చేయాలని ఒక కల ఉండేది. అయితే 20 ఏళ్ళ తర్వాత అంటే 2023లో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాని నేను డైరెక్ట్ చేయడం ఎప్పటికీ మెమొరబుల్ అని చెప్పాలి.
ప్ర.సెల్ఫ్ మేడ్ స్టార్స్ అయిన చిరంజీవి గారు, రవితేజ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
బాబీ : చిరంజీవి గారు, రవితేజ గారు ఎలా అయితే ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చారో నేను కూడా ఏ సపోర్ట్ లేకుండా వచ్చిన వాడినే.! వాళ్ళిద్దరితో సినిమా చేయడం నా అదృష్టం. మాస్ ఆడియన్స్ కు ఏం కావాలి.. వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుంది అనే దానిపై మాత్రమే నేను దృష్టి పెట్టాను.
ప్ర.చిరంజీవి గారి గత రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. ఈసారి కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన టైం. మరి ప్రెజర్ గా ఏమైనా ఫీలవుతున్నారా?
బాబీ : లేదండీ. చిరంజీవి గారు ఎన్నో బ్లాక్ బస్టర్లు చూశారు. అలాగే కొన్ని అపజయాలు కూడా చూశారు. కానీ గత సినిమా ఫలితంతో ఇబ్బంది పడకుండా.. తర్వాతి సినిమాలో చాలా బ్యాలెన్స్డ్ గా వర్క్ చేస్తుంటారు. రవితేజ గారు కూడా అంతే. ‘బలుపు’ చిత్రానికి నేను కూడా పనిచేశాను. ఆ సినిమాకి ముందు వచ్చిన రవితేజ గారి సినిమా బాగా ఆడలేదు. కానీ నెక్స్ట్ సినిమాకి ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంతా పెట్టారు. ఫలితం మాత్రం మన చేతిలో ఉండదు అని ఆయన చెబుతుంటారు. నేను అదే నమ్ముతాను.
ప్ర.చిరంజీవి గారు, రవితేజ గారి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది ? వాల్తేరు వీరయ్య కథ ఏమిటి ?
బాబీ : ప్రతి సీన్ లో ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. అలాగే అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. పండక్కి రాబోతున్న కలర్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు బ్యూటీఫుల్ ఎమోషన్స్ ఉన్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’.
ప్ర.’వాల్తేరు వీరయ్య’ టైటిల్ పెట్టడానికి పెద్ద బ్యాక్ స్టోరీ ఉందట నిజమేనా?
బాబీ : ‘వెంకీ మామ’ షూటింగ్ యాగంటిలో జరుగుతున్నపుడు నాజర్ గారు ఒక పుస్తకం ఇచ్చారు. అందులో వీరయ్య అనే పేరు ఆకట్టుకుంది. ఈ టైటిల్ తో సినిమా చేయాలని అప్పుడే మా టీంకి చెప్పాను. అలాగే చిరంజీవి గారు ఇండస్ట్రీకి రాకముందు బాపట్ల లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు దగ్గర పని చేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ ఐదు వందలు ఇచ్చి ఫోటో షూట్ చేయించారట. ఆ ఫోటోల వలనే మద్రాస్ వచ్చానని చిరంజీవి గారు చెప్పారు. ఆ కానిస్టేబుల్ పేరు కూడా వీరయ్య. ఇది చాలా నోస్టాల్జిక్ గా అనిపించింది. ఇందులో చిరంజీవి పాత్రకు వీరయ్య పేరు అయితే బాగుంటుంది అనిపించింది. ఇది చిరంజీవి గారికి కూడా నచ్చింది. ఇంకో 4,5 పేర్లు కూడా చెప్పాను కానీ ఆయన ‘వీరయ్య’ కే మక్కువ చూపారు.
ప్ర. రవితేజ గారిది క్యామియో రోల్ నా లేక ఎక్కువ లెంగ్త్ ఉంటుందా ?
బాబీ : మీరు 13వ తేదిన చూడాలి(నవ్వుతూ). రవితేజ లేకుండా ‘వాల్తేరు వీరయ్య’ సినిమా లేదని మాత్రం చెప్పగలను.
ప్ర. మీరు గోపీచంద్ మలినేని గారు కలసి పని చేశారు కదా.. ఇప్పుడు పోటీ పడుతున్నారు? ఎలా అనిపిస్తుంది?
బాబీ : నేను రైటర్ గా గోపి డైరెక్టర్ గా చాలా కాలం జర్నీ చేశాం. మేమిద్దరం బ్రో అని పిలుచుకుంటాం. ఒకే బ్యానర్ లో ఇప్పుడు రెండు సినిమాలతో రావడం చాలా ఆనందంగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో కలిశాం. ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నాం. ఇద్దరి సినిమాలు ప్రేక్షకులను బలంగా ఆకట్టుకుంటాయని నమ్మకంగా ఉన్నాం. ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి… ప్రతి హీరోతో సినిమా చేయాలి. పోటీ పడుతున్నాం కదా అని మేమె గెలవాలి అనుకోకూడదు.
ప్ర.’వాల్తేరు వీరయ్య’లో కామెడీకి స్కోప్ ఉందా?
బాబీ : చిరంజీవి గారి డ్యాన్స్ తో పాటు ఫన్ టైమింగ్ కూడా బాగుంటుంది. ఈ మూవీలో కూడా ఆయన ఓ రేంజ్లో ఫన్ జెనరేట్ చేస్తారు.
ప్ర. ‘వాల్తేరు వీరయ్య’ ఫైనల్ కాపీ చూశారా?
బాబీ : నేను చూడటం కంటే 153 సినిమాలు చేసిన చిరంజీవి గారు నేను చేసిన సినిమా చూస్తున్నారంటే నాకు రెండు రాత్రులు నిద్రలేదు. ఆయన జడ్జిమెంట్ చాలా పక్కాగా ఉంటుంది. ఫైనల్ కాపీ చూసి ‘’ఆయన ‘వాల్తేరు వీరయ్య’ తో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం బాబీ’’ అన్నారు. ఆ రోజు నేను గర్వంగా ఫీలయ్యాను. ఆయన నన్ను ఓ తమ్ముడిగా దగ్గరకు తీసుకుని చూపించిన ఆత్మీయత నా జీవితంలో మర్చిపోలేను. చిరంజీవి గారి లాంటి మాస్ మూలవిరాట్ నన్ను కౌగలించుకొని ముద్దు పెట్టుకోవడం సర్రియల్ మూమెంట్. ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టించుకున్నా.
ప్ర. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ గురించి ?
బాబీ : చిరంజీవి గారికి గతంలో 4 మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు దేవి. వాల్తేరు వీరయ్య నాలుగవది. సినిమా థియేటర్ కి వచ్చే ముందు మొదట గెలిచేది ఆడియో పరంగా. ఈ సినిమాకి దేవి మంచి మ్యూజిక్ ఇచ్చాడు.
ప్ర.నిర్మాతలు ‘మైత్రీ’ వారి గురించి చెప్పండి ?
బాబీ : మైత్రీ మూవీ మేకర్స్ తో కలసి పని చేయాలని ఎప్పటి నుండో ఉండేది. అలాంటి సమయంలో నవీన్ గారు సినిమా చేద్దామని అడిగారు. తర్వాత జర్నీ మొదలైయింది. అద్భుతమైన నిర్మాతలు. సినిమా అంటే ప్యాషన్. సినిమాకి ఏం కావాలో ఎక్కడ రాజీ పడకుండా సమకూరుస్తారు.
ప్ర.’వాల్తేరు వీరయ్య’కి సీక్వెల్ ఉంటుందా ?
బాబీ : సినిమా రిలీజ్ అయ్యాక పాత్రలు ప్రేక్షకులు ఓన్ చేసుకుంటే.. అప్పుడు ఆలోచిస్తా. ఇప్పటికైతే లేదు.
ప్ర. హిందీ రిలీజ్ ఉందా ?
బాబీ : ఎస్.. హిందీలో కూడా సేమ్ డేట్ కి రిలీజ్ అవుతుంది.
ప్ర : పాన్ ఇండియా సినిమాలు చేసే ఆలోచన ఉందా ?
బాబీ : పాన్ ఇండియా రాజమౌళి గారు మనకు ఇచ్చిన అద్భుతమైన ఫ్లాట్ ఫామ్. అలాంటి కథ స్ట్రైక్ అయితే తప్పకుండా చేస్తా..!