క్రిష్ – వైష్ణవ్ తేజ్ – రకుల్‌ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘కొండపొలం’ త్వరలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘కొండపొలం’ అనే వర్కింగ్ టైటిల్ వార్తల్లో వినిపించింది. ఆ పేరునే సినిమా టైటిల్ చేసేస్తారు అని అందరూ అనుకున్నారు. అయితే మధ్యలో మరికొన్ని పేర్లు వినిపించాయి. అందులో ‘వనవాసి’, ‘జంగిల్ బుక్’ లాంటి పేర్లు కొన్ని బయటకు వచ్చాయి. ‘వనవాసి’ గురించి క్లారిటీ ఇటీవల ‘కొండపొలం’రచయిత సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి, ఆ మధ్య సంగీత దర్శకుడు కీరవాణి క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ‘జంగిల్ బుక్’ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు క్రిష్. ‘కొండపొలం’ సినిమాకు ‘జంగిల్ బుక్’ అనే పేరు పెట్టాలనే ఆలోచనే రాలేదట. అసలు అలాంటి ఆలోచన చేసింది వెంకటేశ్ సినిమా కోసమట. అవును వెంకటేశ్‌తో క్రిష్ చేద్దామనుకున్న సినిమా ‘జంగిల్ బుక్’లా ఉంటుంది అనుకున్నారట. క్రిష్‌కు ఎప్పట్నుంచో అడవులు, జంతువుల నేపథ్యంలో సినిమా చేయాలని ఉండేదట. సాహసోపేతంగా సాగే అలాంటి సినిమాల్ని చూడటమంటే ఆయనకు చాలా ఇష్టమట.
అందుకే అలాంటి ఓ సినిమా చేద్దామని అనుకున్నారట. అలా వెంకటేష్‌తో ‘అతడు అడవిని జయించాడు’ అనే నవలను తెరకెక్కిద్దాం అనుకున్నారట. ఆ సినిమా ‘జంగిల్‌బుక్’ తరహాలో తెరకెక్కిద్దాం అనుకున్నారట. అయితే ఆ నవల హక్కులు దొరక్క సినిమా కుదర్లేదట.