‘జాతి రత్నాలు’ చిత్రంతో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు దర్శకుడు అనుదీప్. ఆ చిత్రంలో కామెడీ నచ్చింది అని ఎంత మంది చెప్పారో.. నచ్చలేదు అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏది ఏమైనా ఆ సినిమా మాత్రం నిర్మాతలకు, బయ్యర్లకు భారీ లాభాలను అందించింది. దీంతో తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్.. పిలిచి మరీ అనుదీప్ కు అవకాశం ఇచ్చాడు. అలా రూపొందిన చిత్రమే ‘ప్రిన్స్’.
దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. తమిళంలో కూడా సేమ్ రిజల్ట్. అయితే దర్శకుడు అనుదీప్ ఈ చిత్రాల ఫలితాల పై స్పందించాడు. అనుదీప్ మాట్లాడుతూ.. “నా సినిమాల్లో కామెడీని ఎంజాయ్ చేసే వాళ్ళే కాదు ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందైతే నాది చెత్త కామెడీ అంటూ కామెంట్లు పెట్టారు.పెడుతూనే ఉన్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే.
చార్లీ చాప్లిన్ వంటి వాళ్ళకు ఉన్నంత తెలివి నాకు లేదు. నాకున్న తెలివల్లా కామెడీ టైమింగ్ అనే పేరు చెప్పి ఎవరినీ బాధపెట్టకూడదు,అలాగే సినిమాల్లో కామెడీని పండించాలి. ఫ్యామిలీ మొత్తం కలిసి నవ్వుకునేలా సినిమా చెయ్యాలి. అలాగే కామెడీ పండిస్తున్నాను. అది కొంతమందికి నచ్చొచ్చు… కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చకపోతే విమర్శించండి. తప్పులేదు. ఎందుకంటే నేను విమర్శలను స్వాగతిస్తా.
అయితే, విమర్శలు ఎప్పుడూ వివరణాత్మకంగా ఉండాలి. నా సినిమాల్లోని ఏ సీన్లో మీకు కామెడీ నచ్చలేదో చెబితే మరింత మెరుగుపరుచుకుంటా. దానికి అభ్యంతరం ఏమీ లేదు. ఇంకొంతమంది అయితే నా ‘జాతి రత్నాలు’ లక్కీగా హిట్ అయ్యిందన్నారు. అలా, ఎందుకు అంటున్నారో నాక్కూడా చెప్పండి. రెండేళ్లపాటు మేము కష్టపడి ఆ సినిమా చేశాం” అంటూ అనుదీప్ చెప్పుకొచ్చాడు.