అనుష్క, నవీన్ పొలిశెట్టి జంటగా యూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నేడు (గురువారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా యువ దర్శకుడు పి.మహేశ్‌బాబు బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ‘‘జీవితంలో పెళ్లి చేసుకోకూడదనే ఆలోచన ఉన్న ఓ అమ్మాయి తల్లి అవ్వడంలో ఉన్న సంతోషాన్ని కోరుకుంటుంది. అందుకోసం ఓ అబ్బాయి సాయం తీసుకుంటుంది. అలా మొదలైన వాళ్ల ప్రయాణం ఎక్కడ ముగిసింది? ఈ క్రమంలో ఆ జంటకి ఎదురైన పరిణామాలు ఎలాంటివి? మానసికంగా ఎలాంటి భావోద్వేగానికి గురయ్యారనేది ఈ సినిమా కథ.
ట్రైలర్‌లోనే మేం ఈ అంశాన్ని చెప్పి ప్రేక్షకుల్ని సిద్ధం చేశాం. భార్యాభర్తలైనా సరే, ప్రేమికులైనా సరే వాళ్ల మధ్య రొమాన్స్ మాత్రమే కాకుండా… ఎన్నో రకాల భావోద్వేగాల బంధాలు పెనవేసుకుని ఉంటాయి. అలాంటి బంధంలో ఉన్న నాయకానాయికల కథనే ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’లో చూస్తారు. నవీన్ పొలిశెట్టి… సిద్ధు అనే యువకుడిగా, అనుష్క… అన్విత పాత్రలో సహజంగా నటించారు. మనదైన నేటివిటీతోనే రూపొందిన సినిమా కావడంతో…
దక్షిణాది భాషల్లో మాత్రమే విడుదల చేస్తున్నాం. హిందీ వద్దనుకున్నాం. ‘‘ఏ విషయాన్నైనా బహిరంగంగా మాట్లాడుకోవడమే నేటి సమాజం పోకడ. అందుకు తగ్గట్టే ఈ సినిమా ఉంటుంది. కథలో బోల్డ్ కంటెంట్ ఉంది. కానీ, పెద్దలకి మాత్రమే పరిమితం అన్నట్టుగా మాత్రం ఉండదు. సందేశాలు చెప్పలేదు కానీ, అంతర్లీనంగా మాత్రం ఓ మంచి విషయం ఉంటుంది. (Anushka) అనుష్క, నవీన్‌లకి నటులుగా ఓ ఇమేజ్ ఉంది. వాళ్లపై ప్రేక్షకుల్లో ఓ మంచి నమ్మకం ఉంది.
కథలో లోటుపాట్లు ఉంటే వాళ్లే సినిమా ఒప్పుకోరు. ఒక్క క్షణం కూడా ఇబ్బంది పడకుండా సినిమాని చూశామని సెన్సార్ బృందం చెప్పింది. అనుష్కకి కథ చెబుతున్నప్పుడు కూడా ఆమె ఎంతో ఆస్వాదిస్తూ విన్నారు. ఈ సినిమాకు పేరు పేపర్ లో హెడ్ లైన్ చూసి పెట్టాను.. రెండు ప్రధాన పాత్రలపై సాగే సినిమా కావడంతో అందుకు తగ్గట్టే ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే పేరు ఖరారు చేశామని దర్శకుడు పి. మహేష్ బాబు అన్నారు.