సామాజిక అంశాలకు ప్రాధాన్యమిస్తూ సినిమాలను తెరకెక్కించే దర్శకుడు ఎన్. శంకర్. తెలంగాణ నేపథ్య సినిమాలు, బలహీన వర్గాలను ఉద్దరించే కథతో రూపొందిన సినిమాలతో అనే విజయాలు అందుకున్న ఎన్. శంకర్ ఇప్పుడు వెబ్ సిరీస్‌లు తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఎన్‌కౌంటర్’, ‘శ్రీరాములయ్య’, ‘జయం మనదేరా’, ‘ఆయుధం’, ‘భద్రాచలం’, ‘జై బోలో తెలంగాణ’ వంటి సినిమాలు చేసిన ఆయన… గత కొన్నేళ్లుగా కొత్త సినిమాలు చేయడం లేదు. అయితే ఇప్పుడు తన పంథాలోనే వెబ్ సిరీస్‌లు చేస్తారట.
తెలంగాణ నేపథ్యంలో మూడు హిస్టారికల్ వెబ్‌సిరీస్‌లకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. అయితే ఆ సిరీస్‌లకు ఆయన దర్శకత్వం వహించరు. దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేయనున్నారు. ‘ఎన్ శంకర్ టీవీ అండ్ ఫిల్మ్ స్టూడియో’ అనే పేరుతో బ్యానర్‌ను ఏర్పాటు చేసి దానిపై సిరీస్‌లను నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన పరిణామాల ఇతివృత్తంగా ఓ వెబ్‌సిరీస్ నిర్మిస్తారట. ఈ మొత్తం కథను ప్రజల కోణంలోనే చూపించే ప్రయత్నం చేస్తారట.
అక్టోబరులో ఈ సిరీస్ షూటింగ్ ప్రారంభం కానుంది. మహాత్మా జ్యోతీరావు ఫులే స్ఫూర్తితో మరో సిరీస్ ఉంటుంది. జ్యోతీరావు ఫులే జీవితంలో చోటుచేసుకున్న వివిధ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ ఉండనుంది. నాటి దురాచారాలను ఖండించే క్రమంలో ఆయన ఎదుర్కొన్న అవమానాలు, చేసిన త్యాగాలను ఈ వెబ్ సిరీస్‌లో చూపిస్తారట. బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తి… ఆయన వ్యక్తిగత జీవిత పాఠాలతో మూడో వెబ్‌సిరీస్‌ని నిర్మిస్తారట.
అయితే జ్యోతీరావు ఫులే, అంబేద్కర్‌పై తీసే వెబ్‌సిరీస్‌లు వారి బయోపిక్స్ కాదని ఎన్.శంకర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఆ మహనీయుల గురించి ఈ తరానికి తెలియజేయాలనే లక్ష్యంతో జీవితాలను స్ఫూర్తి పొంది ఈ సిరీస్‌లు రూపొందిస్తారు. మూడేళ్లుగా ఈ సిరీస్‌లపై తమ టీమ్ పని చేస్తోందని తెలిపిన (Director N Shankar) ఎన్.శంకర్ తెలుగుతోపాటు హిందీలోనూ వాటిని విడుదల చేస్తామని చెప్పారు.