కొంతమంది దర్శకులకు ఫేవరెట్ హీరోయిన్లు ఉంటారు. వాళ్లు కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నారు అంటే హీరోయిన్ ఆమేనా అని అడుగుతుంటారు. అలానే కొన్ని కథలకూ ఫేవరెట్ హీరోయిన్లు ఉంటారు. అంటే ఆ సినిమా కథ రాస్తున్నప్పుడే ఆమెనే హీరోయిన్ అని ఆ దర్శకుడు ఫిక్స్ అయిపోతారు. అలాంటి ఓ ఘటన ఇటీవల విడుదలైన సినిమా విషయంలో జరిగింది. అదే దీపావళికి వచ్చి మంచి విజయం అందుకున్న ‘అమరన్’ (Amaran) . వీరమరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా కోలీవుడ్‌లో ఈ చిత్రం రూపొందింది.
తెలుగులో డబ్బింగ్ అయిన విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) మాట్లాడుతూ సినిమా కాస్టింగ్, ప్రీప్రొడక్షన్ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో హీరో కంటే ముందే హీరోయిన్‌ను సెలక్ట్ చేసిన విషయం చెప్పుకొచ్చారు. మేజర్ ముకుంద్ జీవితం తనను బాగా ప్రభావితం చేసిందని.. ఆ కథకి ప్రారంభం, ముగింపు అందరికీ తెలుసని.. అందుకే కథను ఆసక్తికరంగా చెప్పడం కత్తి మీద సాము అయందని రాజ్‌కుమార్ పెరియసామి చెప్పారు.
వాస్తవికత, కల్పితాలను బ్యాలెన్స్ చేస్తూ జీవితాన్ని తెరపైకి తీసుకురావడం పెద్ద బాధ్యత అని చెప్పారు. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు హీరో ఎవరు అనే విషయం ఆలోచించలేదని, కానీ కథానాయిక మాత్రం సాయిపల్లవి (Sai Pallavi) అయితేనే బాగుంటుందని అనుకున్నానని చెప్పారు. మేజర్ ముకుంద్ భార్య ఇందు రెబెకా వర్గీస్‌ని కలసి మాట్లాడానని, అప్పుడు ఆ పాత్ర సాయిపల్లవి చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యానని చెప్పారు.
సినిమా కథ అంతా రాశాక శివ కార్తికేయన్‌ని (Sivakarthikeyan) కలసి కథ చెప్పానని, ఆయనకు నచ్చడంతో ముందుకు వెళ్లాం అని చెప్పారు. ఇక సినిమా చూశాక నిర్మాత కమల్ హాసన్ (Kamal Haasan) భావోద్వేగానికి గురయ్యారని, చాలాసార్లు ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయని చెప్పారు రాజ్ కుమార్. లాగే ఇందు మేడమ్ తొలి రోజు చెన్నైలో సినిమా చూసి భావోద్వేగానికి గురయ్యారని చెప్పారు.