బాలీవుడ్‌కి అర్జెంట్‌గా పునర్ వైభవం కావాలి. గత కొన్నేళ్లుగా ఇదే మాట వింటూనే ఉన్నాం. అనుకున్నట్లుగా అప్పుడప్పుడు సరైన విజయాలు, వందల కోట్ల వసూళ్లు వస్తున్నాయి. అయితే ఆ విజయాలు ఇచ్చిన ఆనందాన్ని చంపేయడానికి కొన్ని డిజాస్టర్లు వస్తున్నాయి. మొత్తంగా బాలీవుడ్ కూడబెట్టుకుంటున్న ధైర్యాన్ని చంపేస్తున్నాయి. తాజాగా వచ్చిన ‘సింగమ్ అగైన్’ (Singham Again) సినిమాతో కూడా అదే జరిగింది. సినిమా తొలి షో నుండే ట్రోలింగ్‌ను మూటగట్టుకుంది. తమిళ ‘సింగమ్’ను బాలీవుడ్‌కి తీసుకెళ్లి ‘సింగమ్’ (Singham) , ‘సింగమ్ రిటర్న్స్’ అంటూ వరుస విజయాలు అందుకున్నారు రోహిత్ శెట్టి (Rohit Shetty).
ఆ తర్వాత మన ‘ఆగడు’ సినిమాను అక్కడకు తీసుకెళ్లి కొంత మార్చి ‘సింబా’ చేసి విజయం అందుకున్నారు. ఆ వెంటనే ‘సూర్యవంశీ’ అంటూ వచ్చి ఫర్వాలేదనిపించారు. దీంతో ఇప్పుడు చేసిన ‘సింగమ్ అగైన్’తో విజయం పక్కా అనుకున్నారంతా. కానీ ఆయన వండిన కిచిడీ టేస్ట్ తేడా కొట్టేసింది. దీంతో ‘రోహితూ.. ఇది టూ బ్యాడ్’ అని అంటున్నారు.
సింగమ్ (అజయ్ దేవగణ్)కు (Ajay Devgn) ఎస్పీ శక్తి శెట్టి (దీపిక పడుకొణె) (Deepika Padukone) , ఏసీపీ సత్య (టైగర్ ష్రాఫ్) (Tiger Shroff), సింబా (రణ్‌వీర్ సింగ్) (Ranveer Singh) , డీసీపీ వీర్ సూర్యవన్షీ (అక్షయ్ కుమార్)(Akshay Kumar)ల సాయంతో డేంజరస్ లంకను అంతం చేస్తాడు. ఆఖరులో చుల్‌బుల్ పాండే (సల్మాన్ ఖాన్) కూడా వచ్చాడు. ఇంతమంది వచ్చినా సినిమాకు విజయం అయితే అందివ్వలేకపోయారు. ఇంకా చెప్పాలంటే ట్రోలింగ్ నుండి దూరం కూడా చేయలేకపోయారు.
సినిమాలో చెప్పాలనుకున్న కథ గొప్పదే.. సినిమాలో నటించిన, కనిపించిన హీరోలు, హీరోయిన్లు కూడా గొప్పవాళ్లే. అంత మంది స్టార్లు ఒకసారి ఒకే దగ్గర కనిపిస్తే చూడటానికి ఎవరికి నచ్చదు చెప్పండి. అంతమందిని కలపడమూ చాలా కష్టం. ఇంత కష్టపడినప్పుడు కేవలం ఫైట్స్ కోసమే సినిమా అన్నట్లుగా కాకుండా కథ, కథనం, పాటలు, కామెడీ మీద కూడా దృష్టి పెట్టాల్సింది అనే విమర్శలు వస్తున్నాయి. మరి రోహిత్ శెట్టి ఎంతవరకు ఈ సినిమా నుండి పాఠాలు నేర్చుకుంటారో చూడాలి.
2 hours ago