‘సైంధవ్’ సినిమాను ఓ మెడికల్ ఎమర్జెన్సీ నేపథ్యంలో తెరకెక్కించారు అనే విషయం చాలా రోజులుగా పుకార్లుగా ఉండేది. అయితే సినిమా ట్రయిలర్‌తో ఆ విషయం బయటకు వచ్చేసింది. అయితే సినిమాలో అంతకుమించిన చాలా విషయాలు చర్చించాం అని అంటున్నారు దర్శకుడు శైలేష్ కొలను. ‘హిట్’ సినిమాలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించిన ఆయన ఇప్పుడు ‘సైంధవ్’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
చాలా యాక్షన్ సినిమాలు తరహాలోనే ‘సైంధవ్’కు కూడా సీక్వెల్ ఆలోచన ఉందని చెప్పారు. అలాగే అందరూ చెప్పేలాగే ‘సైంధవ్’ ఫలితం బట్టే ‘సైంధవ్ 2’ ఉంటుంది అని క్లారిటీ ఇచ్చేశారు. ఆ లెక్కన ఆయన ‘హిట్’ సిరీస్ లాగే ‘సైంధవ్’ సిరీస్‌కు సిద్ధం అవుతున్నారు అని తెలిసిపోతోంది. ‘సైంధవ్’ సినిమా కథ దాదాపు 70 శాతం రాత్రి పూటే నడుస్తుందట. డ్రగ్స్, గన్స్ బిజినెస్ ఇలా కథలో చాలా అంశాలు ఉంటాయట. అలాగే ఇదంతా సముద్ర తీరంలో జరగాల్సి ఉందట.
మామూలుగా అయితే విశాఖపట్నం లాంటి ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయంటే నమ్మరు, బాగుండదు కూడా. అందుకే ఈ సినిమా కోసం ‘చంద్రప్రస్థ’ అనే ఫిక్షనల్ టౌన్ ఆలోచన చేశాం అని చెప్పారు శైలేష్ కొలను. అంటే ఈ సినిమా మొత్తం చంద్రప్రస్థ అనే ప్రాంతంలో జరుగుతున్నట్లు చూపిస్తారన్నమాట. మరి ఆ నగరంలో ఏం జరిగింది, ఎవరు చేశారు, దానిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేదే కథ.
మామూలుగా ఇలాంటి ఊళ్లు సిద్ధం చేయడం… పురాణ కథలు, ఫిక్షన్ కథలకు వాడుతుంటారు. కానీ ఈ సినిమా కోసం వాడటం ఆసక్తికరమే. ఇక తన దగ్గర ఒక మంచి ప్రేమకథ ఉందని, తన నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ల ఆధారంగా రాశానని చెప్పారు శైలేష్. ఆ ఆలోచనలతో సినిమా చేస్తాను అని కూడా చెప్పారు. ఇక నాని ‘హిట్ 3’ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని కూడా వెల్లడించారు. ఆ సినిమా విడుదలకు మరో ఏడాదిన్నర అవ్వొచ్చు అని క్లారిటీ ఇచ్చేశారు శైలేష్ కొలను.