సినిమా కష్టాలు అంటే తెలుసా? సినిమాల్లో చూపించే కష్టాలు అనుకునేరు. అది నిజమే కావొచ్చు కానీ అసలు సిసలు సినిమా కష్టాలు అంటే సినిమాలు తీసే, నటించే, నిర్మించే వారి కష్టాలు. ఇలాంటి కష్టాలు దాటకుండా ఏ దర్శకుడూ ఎదగలేదు అంటే అతిశయోక్తి కాదు. అలా ఈ వారం ‘మూవీ మ్యాన్’ సుబ్బు (సోలో బతుకే సో బెటర్ దర్శకుడు) జీవితంలో కూడా ఇలాంటి కష్టాలే ఉన్నాయి. వాటిలో మచ్చుకు ఒకటి చెప్పాలంటే… దర్శకుడు అవ్వాలని ఊరు నుండి వచ్చేసి 14 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడట. ఇది చాలనుకుంటా… ఈ కుర్రాడి సినిమా ప్యాషన్, ఎదగాలనే కోరిక తెలియడానికి.
తన జీవితం.. స్నేహితుల జీవితాల్లో చూసిన సంఘటనలకు ప్రతిరూపంగా ‘సోలో బ్రతుకే సోబెటర్’ రాసుకున్నాడట దర్శకుడు సుబ్బు.. ‘పెళ్లి చేసుకోవాలా.. సింగిల్‌గా ఉండాలా?, అసలు పెళ్లి అవసరమా?, చేసుకొని మన లైఫ్‌ని వేరొకరి చేతుల్లో ఎందుకు పెట్టాలి’.. ఈ ప్రశ్నలన్నీ ఏదోక సందర్భంలో అందరి మనసుల్లో మెదిలేవే. అందుకే ఇలాంటి కథ అయితే అందరికీ కనెక్ట్ అవుతుందనిపించి రాసుకున్నాడట ‘సోలో బతుకే..’ డైరెక్టర్. చిన్నప్పటి నుండి సినిమాలపై ఆసక్తిగా బాగా ఉండేదట. దర్శకత్వం వైపు అడుగేయడానికి పూరి జగన్నాథ్ స్ఫూర్తి అని చెబుతాడు సుబ్బు.
2010లో చిత్ర సీమలోకి అడుగుపెట్టిన సుబ్బు… తొలుత కెమెరామెన్ రసూల్ దగ్గర ‘ఊసరవల్లి’కి పనిచేశారు. ఆ తర్వాత ‘బొమ్మరిల్లు’ భాస్కర్, విరించి వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశారు. ఈ క్రమంలో ఆయన చాలా సినిమా కష్టాలూ అనుభవించారట. ఆకలితో పస్తులు పడుకున్న రోజులూ చూశాడు. ఖాళీ జేబులతో తిరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయని చెబుతుంటాడు సుబ్బు. సుబ్బు హైదరాబాద్‌కి వచ్చి దాదాపు 14ఏళ్లు కావొస్తోందట. ‘ఇన్నేళ్లు అమ్మకు చాలా దూరంగా ఉండిపోయాను. ఆమ్మను నా దగ్గరే ఉంచుకుందాం అంటే ఆమెకు ఇక్కడి వాతావరణం పడదు. అందుకే ఓ ఐదేళ్లు బాగాకష్టపడి.. ఐదు మంచి సినిమాలైనా చేసి అమ్మ దగ్గరికి తిరిగి వెళ్లిపోవాలి’ అని అనుకుంటూ ఉంటాడట. తల్లిని బాగా చూసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందాలి, తల్లికి అందివ్వాలనేది అతని కోరిక.