తేజ సినిమా అంటే చిన్న సినిమా కానీ వసూళ్లలో పెద్ద సినిమా అని అంటుంటారు. తొలి నాళ్లలో ఇలానే జరిగినా తర్వాత చిన్న సినిమాగా మాత్రమే ఉండిపోయాయి. సినిమాలు వస్తున్నా, వసూళ్లు రావడం లేదు. కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టిన ‘నేనే రాజు నేనే మంత్రి’ మాత్రం మంచి వసూళ్లనే అందుకుంది. దీంతో ‘తేజ ఈజ్ బ్యాక్’ అనిపించుకున్నారు. కానీ ఆ తర్వాత చేసిన సినిమా ఆడలేదు. అయితే ఇప్పుడు తేజ ఓ భారీ చిత్రం చేస్తున్నారట. బడ్జెట్ రూ.30 కోట్లు అంట.
ముందుగా చెప్పినట్లు తేజ సినిమాలు చాలావరకు తక్కువ బడ్జెట్‌లో రూపొందినవే. అప్పట్లో ‘చిత్రం’ సినిమాను 30 లక్షల్లో తీశారని అంటారు. అయితే ఇప్పటి ధరల్లో అది మహా అయితే కోటి రూపాయలు అవ్వొచ్చు. ఆ తర్వాత కూడా తక్కువ బడ్జెట్‌లోనే సినిమాలు పూర్తి చేశారు తేజ. ఈ క్రమంలో ఆయన సినిమాలు ఫ్లాప్ అవ్వొచ్చు కానీ మేకింగ్‌లో ఫెయిల్ కాలేదు అంటుంటారు పరిశీలకులు. ఆయనతో సినిమాలు తీసినవారు భారీగా నష్టపోయినట్లుగా ఎప్పుడూ వినలేదు.
దానికి కారణం ఆయన బడ్జెట్ విషయంలో ఎప్పుడూ కంట్రోల్‌గా ఉండటమే. అయితే ఇప్పుడు తన కొడుకు సినిమా కోసం తేజ భారీగా ఖర్చు పెడుతున్నారని టాక్ వినిపిస్తోంది. తేజ తనయుడు అమితోవ్‌త టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ‘విక్రమాదిత్య’ పేరుతో తేజ వారసుడి ఎంట్రీ ఉంటుంది. దీనికి సంబంధించిన పనులను తేజ ఫుల్ స్వింగ్‌లో చేస్తున్నారని టాక్. తేజ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకే రూ.30 కోట్ల బడ్జెట్ అని తెలుస్తోంది.
ఈ లెక్కన తేజ కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రమిదే అవుతుంది. అయితే కొడుకు సినిమా కదా అని తేజ రూ.30 కోట్లు పెట్టడం లేదని అంటున్నారు. ఇండిపెండెన్స్‌కి ముందు జరిగే కథ నేపథ్యంలో సినిమా ఉంటుందట. దీని కోసం కొన్ని సెట్స్ వేయనున్నారట. వాటి కోసమే ఇంత ఖర్చు అని చెబుతున్నారు. అలా కాస్టింగ్ విషయంలోనూ తేజ గట్టిగానే ఆలోచిస్తున్నారట. వాటితో బడ్జెట్ పెరుగుతుంది అని చెబుతున్నారు. వీటిపై త్వరలో అధికారిక సమాచారం ఇస్తారని టాక్.