బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్ళకు అవకాశాలు రావడమే చాలా ఎక్కువ. అవకాశాలు వచ్చిన తర్వాత నిలదొక్కుకోవడం ఇంకా కష్టం. ఇలాంటి టైంలో విజయాలను తలకెక్కించుకుంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది.
టాలీవుడ్..లో ఓ యంగ్ హీరో వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వరుస ప్లాపులతో సతమతమైన ఈ హీరో, ఈ ఏడాది ఆరంభంలో ఒక డీసెంట్ హిట్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అయితే, ఆ సక్సెస్ ఇచ్చిన ధైర్యమో ఏమో గానీ, ఇప్పుడు పలువురు యువ దర్శకులకు చుక్కలు చూపిస్తున్నాడట. కథలు వినడం, నెలల తరబడి నాన్చడం, చివరికి హ్యాండివ్వడం వంటి పనులతో వారి సహనాన్ని పరీక్షిస్తున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ హీరో వల్ల ఓ డెబ్యూ డైరెక్టర్ ఏకంగా 2 ఏళ్ళ విలువైన సమయాన్ని కోల్పోయాడని తెలుస్తోంది. పెద్ద సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరో తనతో సినిమా చేస్తాడని ఆశతో ఆ కొత్త దర్శకుడు అద్భుతమైన కథను సిద్ధం చేసుకున్నాడు. 2 ఏళ్ళ పాటు ఆ హీరో చుట్టూ తిరిగి, కథపై కసరత్తులు చేశాడు. తీరా సమయం వచ్చిన తర్వాత, ‘ఈ సినిమా చేయడానికి నేను ఇంకా సిద్ధంగా లేను’ అని చెప్పి సైడ్ అయిపోయాడట. దీంతో ఆ డెబ్యూ డైరెక్టర్ చేసేదేమీ లేక మరో హీరోను వెతుక్కునే పనిలో పడ్డాడు.
మరోపక్క ఇంతకుముందు ఒక మెమరబుల్ హిట్ ఇచ్చిన ఓ టాలెంటెడ్ డైరెక్టర్ కూడా ఈ హీరో కోసం ఏడాదికి పైగా ఎదురుచూస్తున్నాడట. ఈ యంగ్ హీరో ఆ దర్శకుడి కథను పూర్తిగా తిరస్కరించకుండా, అలాగే అంగీకరించకుండా మధ్యలోనే వేలాడదీస్తున్నాడని తెలుస్తుంది. పలుమార్లు మార్పులు సూచిస్తూ, సమయాన్ని వృధా చేస్తున్నాడని, దీంతో ఆ డైరెక్టర్ తీవ్ర నిరాశలో ఉన్నాడని సమాచారం.ఈ హీరో ప్రవర్తనతో విసిగిపోయిన బాధితులంతా ఇటీవల సమావేశమయ్యారట. ఆ దర్శకులందరూ ఇలా ఏకమై తన గురించి చర్చించుకున్నారని తెలియడంతో ఆ యంగ్ హీరో షాక్‌కు గురయ్యాడట. ఇప్పటికైనా ఈ హీరో తన వైఖరి మార్చుకోకపోతే, భవిష్యత్తులో మంచి కథలు, దర్శకులు దొరకడం కష్టమవ్వొచ్చని ఇండస్ట్రీ జనాలు అభిప్రాయపడుతున్నారు.