రీసెంట్ గా ‘ప్రిన్స్’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాను బైలింగ్యువల్ అన్నారు. తెలుగులో శివకార్తికేయన్ నటిస్తోన్న సినిమా కావడంతో కాస్త బజ్ పెరిగింది. అతడు నటించిన ‘డాక్టర్’, ‘డాన్’ సినిమాలు తెలుగులో వర్కవుట్ అవ్వడంతో ‘ప్రిన్స్’తో తెలుగులో తన మార్క్ క్రియేట్ చేస్తాడని అందరూ భావించారు. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో క్రేజ్ వచ్చింది. కానీ మధ్యలో ఏమైందో కానీ చిత్రబృందం రాజీ పడిపోయింది.
తెలుగులో ఈ సినిమాను నేరుగా తీయకుండా.. తమిళంలో తీసి తెలుగులోకి డబ్ చేశారు. ట్రైలర్ చూసినప్పుడు కానీ ఈ విషయం అర్ధం కాలేదు. ‘జాతిరత్నాలు’ టైప్ లో ‘ప్రిన్స్’లో కామెడీ ట్రై చేసినప్పటికీ తెలుగు నేటివిటీ మిస్ అవ్వడంతో సినిమాపై ఎఫెక్ట్ పడింది. తమిళంలో ఓ మోస్తరు కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా తెలుగులో డిజాస్టర్ గా మిలిగింది. విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘వారసుడు’ సినిమాను కూడా మొదటి నుంచి బైలింగ్యువల్ అని చెప్పారు.
ఆ తరువాత నిర్మాత దిల్ రాజు తనకు నచ్చినట్లుగా ఒకసారి ఇది బైలింగ్యువల్ సినిమా అని.. మరోసారి తమిళ సినిమా అని అంటున్నారు. ఇప్పుడు దర్శకుడు వంశీ పైడిపల్లి ఇది తమిళ సినిమా అని క్లారిటీ ఇచ్చేశారు. నిర్మాత దిల్ రాజు కూడా ‘వారసుడు’ తమిళ సినిమా అని.. తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు. తెలుగులో ఈ సినిమాను వేరుగా తీస్తే ఇక్కడ వర్కవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ అలా ఎందుకు చేయడం లేదో అర్ధం కాని పరిస్థితి.
ఇప్పుడు అందరి దృష్టి ధనుష్ సినిమా ‘సార్’ మీద పడింది. ఈ సినిమాను రూపొందిస్తున్న వెంకీ అట్లూరి తెలుగు డైరెక్టర్. దీన్ని మొదటి నుంచి బైలింగ్యువల్ సినిమా అనే చెబుతున్నారు. టీజర్ లో కూడా ధనుష్ స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమా అయితేనే ధనుష్ కి ఇక్కడ మార్కెట్ పెరగడానికి స్కోప్ ఉంటుంది. మరి ధనుష్ ఏం చేస్తారో చూడాలి!