ఎవరూ తీయని సినిమాలు తీయడంలో బాలీవుడ్ దర్శకుడు ఆర్. బాల్కి ముందుంటాంరు. కొత్తదనం, భావోద్వేగాలు కలగలిపి సినిమాలు తీసి మెప్పిస్తుంటారాయన. గతంలో ఆయన నుండి ఇలా వచ్చిన సినిమాలు ఆకట్టుకున్నాయి కూడా. తాజాగా ఆయన నుండి మరో సినిమా రాబోతోంది. ఈ సినిమా పేరు ‘చుప్’. ఏంటి.. దుల్కర్ సల్మాన్ చేస్తున్న సినిమానే కదా అంటారా? అవును అదే. ఈ సినిమా గురించి ఈ వార్త. ముందుగా చెప్పినట్లు ఆర్.బాల్కి సినిమాలు డిఫరెంట్‌గా ఉంటాయి.
‘కి అండ్ కా’, ‘పా’, ‘షమితాబ్’, ‘ప్యాడ్ మ్యాన్’ ఇవీ ఆయన నుండి ఇటీవల కాలంలో వచ్చిన చిత్రాలు. ఇప్పుడు ఆయన నుండి వస్తున్న ‘చుప్’ చాలా విభిన్నమైనది అని చెప్పొచ్చు. ప్రపంచ సినిమా చరిత్రలోనే ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు అని సినిమా విశ్లేషకులు మెచ్చుకుంటున్నారు. అన్నట్లు ఈ సినిమా సినిమా రివ్యూయర్ల మీద తీసింది కావడం గమనార్హం. అలాంటి ఈ సినిమాకు విభినన్నమైన ప్రచారం చేయాలని నిర్ణయించారు.
మామూలుగా సినిమాల విడుదలకు ముందు ప్రెస్, సెలబ్రెటీల కోసం ప్రివ్యూలు వేశారు. కానీ ‘చుప్’ విషయంలో భిన్నంగా సాధారణ ప్రేక్షకుల కోసమే ఫ్రీ స్పెషల్ ప్రివ్యూలు ఏర్పాటు చేశారు. ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో మధ్యాహ్నం స్పెషల్ ప్రివ్యూలు వేశారు. ప్రేక్షకులు సినిమా చూసి క్రిటిక్స్ కంటే ముందు తమ అభిప్రాయం చెప్పాలనేది టీమ్ ఆలోచనట. అన్నట్లు సినిమా కథ చెప్పలేదు కదా..
కొత్త సినిమాలను రివ్యూ చేసి స్టార్లతో రేటింగ్స్ ఇచ్చే క్రిటిక్స్‌ను వెతికి పట్టుకుని హత్యలు చేసే సీరియల్ కిల్లర్ కథే ఈ సినిమా అట. మంచి సినిమాలకు తక్కువ రేటింగ్స్, చెడ్డ సినిమాలకు ఎక్కువ రేటింగ్స్ ఇచ్చే వారిని ఆ కిల్లర్ చంపుతుంటాడట. అంతేకాదు చంపాక వాళ్లకు రేటింగ్స్ ఇస్తాడట. మరి ఆ తర్వాత ఏమైంది అనేది ఈ నెల 23న థియేటర్లలో చూడొచ్చు. సన్నీ డియోల్, దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రధారులు.