సినిమాను రీమేక్ చేయడం చాలా ఈజీ అంటుంటారు. అయితే ఒక విజయవంతమైన సినిమాను సరిగ్గా తీయకపోతే చాలా మాటలు పడాల్సి వస్తుంది. అలానే ఉన్నది ఉన్నట్లే తీసేసినా మాటలు పడతారు. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. అందుకేనేమో చాలామంది యువ హీరోలు ఇప్పుడు రీమేక్‌ల విషయం ముందుకు రావడం లేదు. కల్ట్ క్లాసిక్‌లు, మాస్ హిట్ల విషయంలో కరాఖండిగా తమ అభిప్రాయం చెప్పేస్తున్నారు. ‘నో టు రీమేక్స్’ అనేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో దుల్కర్ సల్మాన్ కూడా చేరాడు.
మలయాళంలో విభిన్న పాత్రలు పోషిస్తూ అనతికాలంలో డిఫరెంట్ హీరో అనిపించుకున్నాడు దుల్కర్. కమర్షియల్ సినిమాలు, ప్రయోగాత్మక సినిమాలు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాయి. అందుకే పాన్ ఇండియా రేంజిలో ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవల ‘సీతారామం’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని అలరించి మమ్ముట్టి తనయుడు.. ఇప్పుడు ‘కింగ్ ఆఫ్ కోథా’ అంటూ పలకరించడానికి సిద్ధమయ్యాడు. మలయాళంలో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తెలుగులో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో జరుగుతున్న అతి పెద్ద చర్చల్లో రీమేక్స్ ఒకటి. సినిమాను రీమేక్ చేయడానికి కొందరు హీరోలు ముందుకొస్తుంటే ‘మనకెందుకు రీమేక్స్’ అంటూ ప్రశ్నించేవాళ్లు ఉన్నారు. అలాగే ‘రీమేక్ చేస్తే తప్పేంటి’ అనేవాళ్లూ ఉన్నారు. ఇప్పుడు ఇదే మాటను దుల్కర్ దగ్గర అడిగితే.. జూనియర్ ఎన్టీఆర్ తరహా ఆన్సర్ ఇచ్చాడు. దీంతో ఇక దుల్కర్ నుండి రీమేక్‌లు ఆశించడం అసాధ్యం అని తేల్చేశారు జనాలు.
మీరు రీమేక్ సినిమాలు చేస్తారా? మీ నాన్న సినిమాల నుండి చేయాలంటే దేనికి మీ ఓటు? అని అడిగితే.. నేను రీమేక్ సినిమాలు చేసే ఛాన్సే లేదు. మా నాన్న సినిమాలని కాదు, ఏ సినిమాను కూడా రీమేక్ చేయను అని తేల్చి చెప్పాడు దుల్కర్. అయితే ఎందుకు అనే మాట మాత్రం చెప్పలేదు. ఇక ‘కింగ్ ఆఫ్ కోథ’ సినిమా ఆగస్టు 24న రిలీజ్ అవుతుంది.