‘కన్నడ కంఠీరవ’ డా. రాజ్ కుమార్ తనయుడు, ‘కరుణాడ చక్రవర్తి’ డా, శివ రాజ్ కుమార్ సోదరుడు, కన్నడ ‘పవర్ స్టార్‘ స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ నటుడిగానే కాకుండా గొప్ప మానవతావాదిగానూ కర్ణాటక ప్రజల, అభిమానుల మనసుల్లో చెరుగని ముద్రవేశారు.. మరణానంతరం గౌరవార్దం ఆయనకు ‘కర్ణాటక రత్న’ పురస్కారం అందజేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరణించిన తర్వాత ప్రజల హృదయాల్లో నిలిచి ఉండడమే అసలైన జన్మకు అర్థం అనే మాటను అక్షరసత్యం చేశారాయన. గతేడాది అక్టోబర్ 29న పునీత్ కన్నుమూశారు.
ఆయన జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన ‘జేమ్స్’ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాక, వంద కోట్ల వసూళ్లను సాధించింది. పునీత్ మొదటి వర్థంతిని పురస్కరించుకుని, ఒకరోజు ముందుగా అక్టోబర్ 28న ఆయన నటించిన ‘గంధడ గుడి’ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 27 రాత్రి బెంగుళూరులో ప్రీమియర్స్ వేశారు. ఈ స్పెషల్ షోలకు పునీత్ కుటుంబ సభ్యులు, కన్నడ ఇండస్ట్రీ ప్రముఖులు, విప్రో నారాయణ సతీమణి, పునీత్ అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
పునీత్‌ని తలుచుకుని వారంతా భావోద్వేగానికి గురయ్యారు. రాబోయే తరానికి ఈ సినిమా ద్వారా గొప్ప సందేశాన్నిచ్చారని.. భౌతికంగా పునీత్ మన మధ్య లేకపోయినా.. ప్రజల మనసుల్లో ఎప్పుడూ నిలిచి ఉంటారని కొనియాడారు. పునీత్‌కి ఈ చిత్రం అసలైన ఘననివాళి అని చూసిన వారంతా చెప్పారు. పునీత్ ప్రధాన పాత్రలో నటించగా.. పీఆర్‌కే ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఆయన భార్య అశ్వినీ పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా.. అమోఘ వర్ష దర్శకత్వంలో ‘గంధడ గుడి’.. రూపొందింది.
పర్యావరణాన్ని, జంతు జాతుల్ని సంరక్షించుకోవాలనే గొప్ప సందేశంతో తెరకెక్కించిన ఈ మూవీని కన్నడనాట ఇవాళ విడుదలైంది. త్వరలో ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసే అవకాశముందని అంటున్నారు. అక్టోబర్ 29న పునీత్ ఫస్ట్ డెత్ యానివర్సరీ సందర్భంగా కర్ణాటక ప్రజలు ఘన నివాళులు అర్పించనున్నారు.
Emotional moments from Puneeth Rajkumar’s #GandhadaGudi Premier Shows