విశాఖపట్టణంలో స్టూడియోని నిర్మించాలి అనేది దివంగత స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు గారి కల. ఇందుకోసం అప్పట్లో దాసరి వంటి పొలిటీషియన్లతో సిటీ మధ్యలో ఖరీదైన స్థలాన్ని కొనుగోలు చేశారు.ఇందుకోసం కారంచేడు లో ఉన్న ఆయన పొలాలను అమ్ముకున్నట్లు కూడా గతంలో ప్రచారం జరిగింది. తండ్రి కోరికను ఎప్పటికైనా నెరవేర్చాలి అని సురేష్ బాబు కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఎప్పుడైతే మూడు రాజధానుల ఆలోచన ఏపీ సీఎం జగన్ కు వచ్చిందో అప్పటి నుండీ ఆ స్థలాన్ని కొనుగోలు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారని కొన్ని నెలల నుండి ప్రచారం జరుగుతుంది.
జగన్ భార్య భారతి కళ్ళు ఆ స్టూడియో స్థలం పై పడడమే ఇందుకు కారణమని కూడా ప్రచారం జరిగింది. జగన్ అనుకున్నట్టుగానే విశాఖలో రామానాయుడు స్టూడియో స్థలాన్ని లాగేసుకున్నట్టు టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయిన అయ్యన్నపాత్రుడు చెప్పి అందరినీ షాక్ కు గురి చేశారు. ఆయన మాట్లాడుతూ.. “విశాఖపట్నంలో ఉన్న రామానాయుడు స్టూడియో స్థలం పై సీఎం జగన్ సతీమణి భారతి కన్ను పడింది. అందుకే దాన్ని స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమైంది.
ఇప్పుడు అది చేతులు మారిపోయింది. దగ్గుబాటి సురేష్ బాబును పిలిపించుకుని మరీ బెదిరించి కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు జగన్. ఈ విషయం పై నేను దగ్గుబాటి సురేష్ బాబుతో కూడా మాట్లాడాను. ‘బెదిరిస్తున్నారు… ఏం చేయమంటారు… నేను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో సంతకాలు పెట్టేశాను అంటూ’ సురేష్ బాబు నాకు చెప్పారు. రామానాయుడు స్టూడియో కబ్జా గురించి ఇప్పటివరకు చాలా మందికి తెలీదు.
విశాఖలో ఏపీ ప్రభుత్వం భూ కబ్జాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది” అంటూ అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. విశాఖలో ఉన్న స్టూడియో గురించి సురేష్ బాబు గతంలో పరోక్షంగా మాట్లాడారు. ఒకటి రెండు సార్లు అడిగారు కానీ కుదరదు అని చెప్పినట్టు సురేష్ బాబు చెప్పారు. అయితే ఇప్పుడు దాని గురించి ఆయన మాట్లాడటం లేదు.