2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ‘ఎఫ్2’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్,వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఈ చిత్రం ఫుల్ రన్లో 80కోట్ల వరకూ షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన ప్రతీ బయ్యర్ కు రెండింతల లాభాలను అందించింది. ఇప్పుడు ‘ఎఫ్2’ సీక్వెల్ గా ‘ఎఫ్3’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజే నిర్మిస్తున్నాడు.
ఆగష్ట్ 27 న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టు ఈ మధ్యనే దర్శకనిర్మాతలు అధికారికంగా తమ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కాగా ఈ చిత్రం నుండీ ఒక్క టీజర్ కూడా విడుదల కాకుండానే.. ‘ఎఫ్3’ డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులు భారీ రేటుకి అమ్ముడు పోయినట్టు తెలుస్తుంది. అందుతోన్న సమాచారం ప్రకారం.. ‘ఎఫ్3’ మూవీ డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులు 25కోట్ల భారీ రేటుకి అమ్ముడు పోయాయట. ఇంకా హిందీ డబ్బింగ్ రైట్స్ వంటివి అమ్ముడుపోకుండానే ఇంత పెద్ద మొత్తం రాబట్టినట్టు తెలుస్తుంది.
వాటిని మరో 10కోట్లకు విక్రయించినా మొత్తం కలిపి 35కోట్ల వరకూ నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగే అవకాశం ఉంది. కనీసం టీజర్ కూడా విడుదల కాకుండానే ఇంత పెద్ద మొత్తానికి డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ బిజినెస్ జరిగింది అంటే.. ‘ఎఫ్3’ పై ఎంత క్రేజ్ ఉందనేది స్పష్టమవుతుంది. ఇక తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ప్రగతి,రఘుబాబు వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.