సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఓ రకంగా ఇది సినీ పరిశ్రమకు చెందిన వారందరిలో ఆందోళన పెంచే అంశం. తాజాగా మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్నుమూశాడు. బాలీవుడ్ నటుడు జితేంద్ర శాస్త్రి హిందీ సినిమాలు ఎక్కువగా చూసేవారికి సుపరిచితమే..! ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘మిర్జాపూర్’ సిరీస్ చూసిన వాళ్లకు అయితే ఇతన్ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ సిరీస్ లో అతను ఉస్మాన్ అనే పాత్రను పోషించాడు. అయితే అనారోగ్య సమస్యలతో ఇతను మరణించినట్టు అతని సహచర నటులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
జితేంద్ర శాస్త్రి ‘బ్లాక్ ఫ్రైడే’, ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’, ‘రాజ్మా చావ్లా’ వంటి సినిమాల్లో కూడా నటించి తన నటనతో ఆకట్టుకున్నాడు. నాటక ప్రపంచానికి కూడా ఇతను సుపరిచితుడే.! ఎన్నో నాటకాల్లో తన అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు. ఇక జితేంద్ర మృతి పై మరో బాలీవుడ్ నటుడు సంజయ్ మిశ్రా తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. “జీతూ భాయ్ మీరు ఉండి ఉంటే గనుక.. ‘సంజయ్.. కొన్ని సార్లు ఏం జరుగుతుందో ఏమో.. మొబైల్‌లో పేరు ఉండిపోతుంది. కానీ, మనుషులు నెట్‌వర్క్‌నుంచి దూరమై పోతారు’’ ఇలా అనుండే వారు.
మీరు ప్రపంచం నుంచి దూరం అయిపోయి ఉండొచ్చు. కానీ, నా మెదడు, హృదయం నెట్‌వర్క్‌లో ఎప్పుడూ ఉంటారు’’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. జితేంద్ర మృతిపై మరో బాలీవుడ్ నటుడు రాజేష్ తైలాంగ్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ… ‘‘ జితేంద్ర బ్రదర్ లేడంటే నమ్మలేకుండా ఉన్నాను. ఆయన ఎంతో అద్భుతమైన నటుడు, ఎంతో మంచి మనిషి, తన హ్యూమర్‌తో అందరినీ బాగా నవ్వించేవారు. నాకు ఆయనతో పనిచేసే అవకాశం కలిగింది. అది నా అదృష్టం’’ అంటూ పేర్కొన్నాడు.