మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana ShankaraVaraprasad Garu) చిత్రాన్ని వీక్షిస్తూ ఓ అభిమాని గుండెపోటుతో మరణించడం చర్చనీయాంశం అయ్యింది. హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి అర్జున్ థియేటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రిటైర్డ్ ఏఎస్సై ఆనంద్ కుమార్ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. ఈరోజు ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా చూసేందుకు అతను ఉ.11.30 గంటల షోకి అర్జున్ థియేటర్ కి వెళ్ళాడు.
అయితే సినిమా చూస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడం వల్లనే అతను స్పృహ కోల్పోయినట్టు అంతా భావించారు. దీంతో థియేటర్ యాజమాన్యం వెంటనే అతన్ని దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తరలించింది. అయితే ఈలోపే ఆనంద్ కుమార్ మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ విషాద సంఘటన యావత్ థియేటర్ యాజమాన్యాన్ని అలాగే చిరు అభిమానులను కుదిపేసింది అనే చెప్పాలి.

అతని ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ చిత్రం ఈరోజు అనగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న నైట్ ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి. సినిమా చూసిన వారిలో ఎక్కువ శాతం ప్రేక్షకులు.. పాజిటివ్ రిపోర్ట్స్ చెబుతున్నారు. దీంతో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది.
మరికొంతమంది అభిమానులు సంక్రాంతి విన్నర్ ఈ సినిమానే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమాతో దర్శకుడు అనిల్ రావిపూడి ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించాడు అని చెప్పాలి.
