Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

ఫ్యాన్‌ వార్‌.. అని క్లాస్‌గా మాట్లాడుకుంటున్నాం, రాస్తున్నాం, చూస్తున్నాం కానీ.. ఇది ఏకంగా టాలీవుడ్‌ సినిమా పరిశ్రమను చంపేసే అతిపెద్ద పనికాని పని. ఈ మాటలు వింటే ఫ్యాన్స్‌ రూపంలో సోషల్‌ మీడియాలో అక్కసు వెళ్లగక్కే వారికి కోపం రావొచ్చు. కానీ వాళ్లు చేస్తున్న పని వల్ల మొత్తం పరిశ్రమే ఇబ్బందుల్లో పడిపోతోంది అనే విషయం తెలుసా? ఒక హీరో మీద కోపానికి కొందరు నాలుగు మాటలు అంటుంటే.. మరో హీరో మీద కోపానికి ఇంకొరు మరో నాలుగు మాటలు అంటున్నారు. ఇది అలా పెరిగి పెరిగి ఏకంగా సినిమా పరిశ్రమ ఉనికి మీదకే వచ్చేలా ఉంది.

Fan Wars

ఈ విషయాన్ని మీకు సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఈ ఫ్యాన్‌ వార్స్‌ రాచపుండు లాంటివి. మొత్తంగా మనిషినే ఇబ్బంది పెట్టేస్తాయి. ఒక హీరో సినిమా వస్తోంది అంటే చాలు.. గతంలో ఆ హీరో సినిమాల వీడియోలు షేర్‌ చేస్తూ నోటికొచ్చింది అంటున్నారు. దానికి మేం ఫలానా హీరోల ఫ్యాన్స్‌ అని తెలిసేలా ఎక్స్‌లో ప్రొఫైల్‌ డిస్‌ప్లే నేమ్స్‌ మార్చేస్తున్నారు. దీంతో ఆ హీరోల సినిమాలు వచ్చేటప్పుడు గతంలో మాటలు పడ్డ హీరోల ఫ్యాన్స్‌ డ్యూటీలు ఎక్కుతున్నారు. దీనికి గిఫ్ట్‌ ఇచ్చారు.. మేం రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తున్నాం అనే పేరు కూడా పెట్టుకున్నారు.

ఇక సినిమా విడుదలయ్యాక తొలి షోకి వెళ్లిపోయి వీడియోలు రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ట్రోల్‌ చేస్తున్నారు. సినిమాలో మెయిన్‌ ప్లాట్స్‌ లీక్‌ అయి సినిమా మీద ఆసక్తి తగ్గిపోతోంది. ఇక సీజన్‌ మారినప్పుడు ఇదే పరిస్థితి రివర్స్‌ అవుతోంది. దీని వల్ల నెటిజన్లు / ఫ్యాన్స్‌ ఏం లాభమో కానీ.. సినిమా తీసిన నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు, హీరోలు ఇబ్బందులు పడుతున్నారు. రీసెంట్‌గా టాలీవుడ్‌లో వచ్చిన ప్రతి పెద్ద (పేరున్న) సినిమాకు ఇదే పరిస్థితి ఎదురైంది.

ఒక వ్యక్తిని ప్రేమించడం అంటే మరో వ్యక్తిని తిట్టడం కాదు అని చిన్నతనం నుండి మన ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది ఇప్పుడు సినిమా పరిశ్రమ విషయంలోనూ వర్తిస్తుందని పెద్దగా చెప్పక్కర్లేదు. లోపం లేని సినిమా ఉండదు.. కానీ సినిమాను ఆ లోపంతో చిల్లులు పొడిచేలా ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతలా మారిందంటే సినిమా రిలీజ్‌ రోజు వచ్చిన హిట్‌ టాక్‌ మూడో రోజుకు పోతోంది. అంతలా నెగిటివ్‌ ప్రచారం చేస్తున్నారు. ఇదంతా ఫ్యాన్‌ వార్‌లో భాగమే.

గతంలో ఫ్యాన్‌ వార్క్‌ ఫిజికల్‌గా ఆఫ్‌లైన్‌లో ఉండేవి. ఆ సమయంలో మన హీరోలు కొంతమంది ముందుకొచ్చి ‘ఫ్యాన్ వార్స్‌ వద్దు’ అని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆన్‌లైన్‌ వార్‌ గురించి రియాక్ట్‌ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా రివ్యూల మీద ఆగ్రహాలు వ్యక్తం చేసే కొంతమంది దర్శక,నిర్మాతలు ఈ విషయంలో కామ్‌గా ఉంటున్నారు. కొందరైతే ఇంకాస్త ఎగదోస్తున్నారు. వాళ్లు కూడా రియాక్ట్‌ అవ్వాల్సిన అవసరం ఉంది.

కంటిన్యుటీ ఇష్యూ వల్లే మహేష్ సినిమా ఆడలేదా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus