మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్.. ఐలవ్ యూ… ఇలా వరుసగా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో తేజు రీ ఫ్రెష్ కావడానికి విదేశాలకు వెళ్లారు. బాధలో ఉన్న అతనికి సంతోషం కలిగించే విజయం ఒకటి వరించింది. అది ఏమిటంటే.. వెండితెర పై ఆకట్టుకోని సినిమాలు నెట్టింట్లో బాగా ఆదరణకు నోచుకుంటున్నాయి. అదేనండీ.. యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ రాబట్టి ఔరా అనిపిస్తున్నాయి. ప్రభాస్ కెరీర్లో ఘోరంగా ఫెయిల్ అయిన “రెబల్’కు యూట్యూబ్ లో కోట్లల్లో వ్యూస్ వచ్చాయి. ఇంకా చాలా ఫ్లాప్ సినిమాలు యూట్యూబ్ లో భారీ వ్యూస్ తెచ్చుకుంటున్నాయి.
ఇదంతా తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారని అనుకోకండి. ప్లాప్ అయిన తెలుగు సినిమాలను హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేస్తుంటే.. ఉత్తరాది ప్రేక్షకులు ఇష్టంగా చూసేస్తున్నారు. అందుకే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా దువ్వాడ జగన్నాథం ఇప్పటికే యూట్యూబ్ లో సంచలన వ్యూస్ సాధిస్తోంది. తాజాగా సాయిధరమ్ తేజ్ “జవాన్” సినిమాని హిందీ లో డబ్ చేసి “జవాన్” పేరుతోనే రెండు రోజుల కిందటే యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈ సినిమాని నెటిజనులు విపరీతంగా చూస్తున్నారు. 48 గంటల్లోనే “జవాన్” వ్యూస్ కోటికి చేరిపోవడం విశేషం. “జవాన్” యూట్యూబ్ లో హిట్ కావడంతో “ఇంటిలిజెంట్”, తేజ్ ఐ లవ్యూ” సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు.