“సక్సెస్” పదానికి ఇండస్ట్రీలో ఇచ్చే వేల్యూ మనుషులకి కూడా ఇవ్వరు. ఒక దర్శకుడు, హీరో లేదా హీరోయిన్ సక్సెస్ సొంతం చేసుకొంది అంటే వారి చుట్టూ అందరూ చీమల మంద కంటే దారుణంగా మూగుతారు. కానీ.. ఎన్టీఆర్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. అతడి మునుపటి సినిమాలు చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. “టెంపర్”కి ముందు పూరీ జగన్నాధ్ కు, “నాన్నకు ప్రేమతో”కి ముందు సుకుమార్ కి, “జైలవకుశ”కి ముందు బాబీకి, తాజాగా “అరవింద సమేత”కి ముందు త్రివిక్రమ్ కి కానీ సరైన హిట్ లేదు. పైగా.. వారి మునుపటి సినిమాలు డిజాస్టర్స్ గా డిక్లేర్ చేయబడ్డాయి.
కానీ.. ఎన్టీఆర్ వారి పాలిట కల్పవృక్షంలా మారాడు. “టెంపర్”తో పూరీ జగన్నాధ్ కి, “నాన్నకు ప్రేమతో” సుకుమార్ కి, “జైలవకుశ”తో బాబీకీ.. ఇక రీసెంట్ గా “అరవింద సమేత”తో త్రివిక్రమ్ కి సూపర్ హిట్స్ ఇవ్వడమే కాక వాళ్ళ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను కట్టబెట్టాడు. దాంతో అప్పటివరకూ ఫ్లాప్ సినిమా డైరెక్టర్స్ తో సినిమాలు చేయకూడదు అనే సెంటిమెంట్ కు బ్రేక్ పడింది. ఎన్టీఆర్ అభిమానులందరూ సరదాగా “ఎన్టీఆర్ గ్యారేజ్.. ఇచ్చట ఫ్లాప్ డైరెక్టర్స్ కి సక్సెస్ లు ఇవ్వబడును” అని మీమ్స్ చేయడం మొదలెట్టారు. ఏదేమైనా.. ఒక దర్శకుడి కెరీర్ గ్రాఫ్ ను పట్టించుకోకుండా తాను పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడు సదరు దర్శకుడి ప్రతిభను నమ్మి తన కెరీర్ ను రిస్క్ చేయడం అన్నది కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే చెల్లింది.