Tollywood: ఈ శుక్రవారం గట్టెక్కేది ఎవరో? మళ్ళీ రీ రిలీజ్ సినిమాల సౌండ్
- February 5, 2026 / 06:00 PM ISTByFilmy Focus Writer
సంక్రాంతి సందడి ముగియడంతో థియేటర్ల వద్ద ఒక్కసారిగా సైలెన్స్ కనిపిస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలు లేకపోవడంతో బాక్సాఫీస్ వెలవెలబోతోంది. అయితే ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకోవడానికి ఈ శుక్రవారం ఏకంగా ఎనిమిదికి పైగా చిన్న సినిమాలు లైన్ లో ఉన్నాయి. స్టార్ హీరోల అండ లేకపోవడంతో ఈ చిత్రాలకు సరైన బజ్ రావట్లేదు. కంటెంట్ బాగుంటే తప్ప ఆడియన్స్‌ను థియేటర్ల వరకు రప్పించడం ప్రస్తుతానికి ఒక పెద్ద ఛాలెంజ్‌గా మారింది.
Tollywood
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ చాలా కాలం తర్వాత ‘యుఫోరియా’ అనే సినిమాతో వస్తున్నారు. ఇందులో సారా అర్జున్ మెయిన్ రోల్ ప్లే చేస్తోంది. గతంలో ఒక్కడు, చూడాలని ఉంది లాంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన గుణశేఖర్, ఈసారి ఒక సీరియస్ అండ్ యూత్‌ఫుల్ థీమ్‌ను ఎంచుకున్నారు. అలాగే ‘పలాస’ డైరెక్టర్ కరుణ కుమార్ ‘హనీ’ అనే హారర్ డ్రామాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ సినిమాలకు టాక్ పాజిటివ్‌గా వస్తేనే వీకెండ్ కలెక్షన్లు పుంజుకునే అవకాశం ఉంది.
ఇక ప్రమోషన్స్ విషయంలో కొందరు వినూత్నంగా వెళ్తుంటే, మరికొందరు వివాదాలనే నమ్ముకున్నారు. ‘శ్రీ చిదంబరం గారు’ ఆన్‌లైన్ ప్రమోషన్లతో హడావిడి చేస్తుంటే, ‘బరాబర్ ప్రేమిస్తా’ టీమ్ మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో పాడిన ఒక బోల్డ్ సాంగ్‌తో వార్తల్లో నిలిచింది. ఇక రవితేజ సపోర్ట్ ఉన్న ‘సుమతీ శతకం’తో పాటు ‘ఎర్రచీర’ వంటి సినిమాలు కూడా రేసులో ఉన్నాయి. తమిళం నుంచి వస్తున్న డబ్బింగ్ మూవీ ‘విత్ లవ్’పై కూడా యూత్ కొంచెం ఆశలు పెట్టుకున్నారు.
అయితే చిత్రమైన విషయం ఏంటంటే.. కొత్త సినిమాల కంటే రీ రిలీజ్ అవుతున్న ఓల్డ్ హిట్ మూవీస్ కే బుకింగ్స్ అదిరిపోతున్నాయి. రామ్ చరణ్ ‘ఆరెంజ్’, ధనుష్ ‘3’ చిత్రాలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. థియేటర్లలో కొత్త సినిమాలు ఉన్నా, ఫ్యాన్స్ మాత్రం మళ్ళీ పాత సినిమాలకే జై కొడుతున్నారు. కనీసం ఈ సినిమాలైనా థియేటర్లకు కళ తీసుకొస్తాయని ఎగ్జిబిటర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.












